Modi vs Mamata banerjee | బెంగాల్లో భారీ పోలింగ్ సంకేతాలేమిటి?

Modi vs Mamata banerjee | బెంగాల్లో భారీ పోలింగ్ సంకేతాలేమిటి?
Modi vs Mamata banerjee | రికార్డు స్థాయి ఓటింగ్ వెనుక అసలు కారణాలు
ఓటర్ల జాబితా వివాదం – రాజకీయ ప్రభావం
భావోద్వేగ ఓటింగ్, భద్రతా చర్యల ప్రభావం
Modi vs Mamata banerjee | డార్జిలింగ్ కొండల నుంచి జంగమహల్ వరకూ మధ్యలో అంతా పురూలియా జిల్లా ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉండేది. పశ్చిమ బెంగాల్ శాసనసభకు గురువారం జరిగిన తొలివిడత ఎన్నికల్లో 92 శాతం పోలింగ్ నమోదైంది. 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి 8 పాయింట్లు ఎక్కువ. ఈ ప్రాంతంలో పోలింగ్ పెరగడానికి ఓటర్ల జాబితా ముమ్మర సవరణ (ఎస్ఐఆర్)ను పటిష్టంగా అమలు చేయడమే కారణమని అంటున్నారు. దీంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కేంద్ర ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీ మధ్య ఘర్షణ తలెత్తింది.
బెంగాల్లో ఎస్ఐఆర్ రాజకీయ వివాదంగా మారింది. ముమ్మర సవరణ కార్యక్రమం కింద 91 లక్షల మంది పేర్లు తొలగింపు జరిగింది. స్క్రూటినీ తర్వాత 27 లక్షల పేర్లు తొలగించారు. ఈ పేర్లలో ఎక్కువ మంది ముస్లింలవేనన్న ఆరోపణలు వచ్చాయి. వీటిని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలు కోసం ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి.
మమతా బెనర్జీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత క్లిష్టమైన పోటీని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పాలనా యంత్రాంగాన్ని పూర్తిగా తన నియంత్రణలోకి తీసుకుంది. ముఖ్యమైన పదవుల్లో ఉన్న ఆమె విధేయులను బదిలీ చేసింది. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లపై, ఆ పార్టీ నాయకుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు జరిపారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఎన్నికల కమిషన్ అరెస్టు చేసింది. పోలింగ్‌కు 120 గంటల ముందు నుంచి రాష్ట్రంలో విధులు నిర్వహించవద్దని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మొదటి దశ పోలింగ్‌లో భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఈ పోలింగ్ సరళిని బట్టి చూస్తే ఈ ఎన్నికలు మమతా వర్సెస్ ప్రధానమంత్రి మోదీ మధ్య నేరుగా పోటీగా మారినట్లు చెబుతున్నారు. ఆమె 15 సంవత్సరాలుగా ఏకధాటిగా అధికారంలో కొనసాగుతున్నారు. ఆమె పాలనలో అవినీతి పెరిగిందని, మహిళలకు భద్రత లేదని, నిరుద్యోగం పెరిగిందని ఆరోపణలు వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు, మయన్మార్‌కు చెందిన రోహింగ్యా ముస్లింలకు ఆమె హయాంలో ఆదరణ పెరిగిందన్న విమర్శలు ఉన్నాయి.

రాష్ట్రంలో పౌరుల హక్కులను కేంద్రం హరిస్తోందని, ముఖ్యంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్సీ)ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మమత ఆరోపించారు. ప్రజల పౌరసత్వ హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లాగేసుకుంటోందని కూడా ఆమె విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ జరగడం కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలపై ఒక రిఫరెండంగా కూడా భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత వల్ల కాకుండా, మధ్యలో చోటుచేసుకున్న అంశాల కారణంగానే ఎక్కువ పోలింగ్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు.
భావోద్వేగ ఓటింగ్: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు భావోద్వేగ ఓటింగ్ అన్ని చోట్లా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో సాధారణంగానే భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా లేవనెత్తిన అంశాల వల్ల భావోద్వేగాలు పెచ్చుపెరిగాయి. తమ ఓట్లు పోయాయేమోనన్న భయం ప్రతివారిలో కనిపించింది. ఓటర్ల జాబితాలను సరిచూసుకునే ఆత్రుత, తమ ఓట్లు ఉన్నాయా లేదా అన్న ఆందోళన అందరిలో కనిపించింది. రాష్ట్రంలో ఓటర్లు నెలల తరబడి ఆందోళనలో గడిపారు. తమ ఓటు హక్కు కోల్పోకుండా చూసుకోవాలన్న దృఢ సంకల్పం ప్రతి ఒక్కరిలో కనిపించింది.
స్వల్ప సాంకేతిక కారణాలతో తమ ఓట్లు తొలగిస్తారేమోనన్న భయం ప్రజల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో వదంతులు ఆందోళనను మరింత పెంచాయి. ఓటర్ల జాబితాలను ఉద్దేశపూర్వకంగా మార్చుతున్నారన్న ప్రచారం ప్రజల్లో గందరగోళం సృష్టించింది. మాల్దా జిల్లాలో ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పేర్లు తొలగిస్తున్నారన్న వార్తలు ఉద్రిక్తతను పెంచాయి. తమ పేర్లను పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో చేర్చారన్న వార్తలు కూడా గందరగోళాన్ని పెంచాయి. ఈ నేపథ్యంలో మాల్దా జిల్లాలో 95 శాతం పోలింగ్ నమోదు కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
మైనారిటీల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్తలతో వారి మధ్య భయం మరింత పెరిగింది. ఇది సాధారణ ఆందోళన కాదని, ఓటర్లు తమ పేర్లు తొలగించబడ్డాయేమోనన్న అనుమానంతో జాబితాలను పదేపదే సరిచూసుకోవడం కనిపించింది. వలస కార్మికుల ఆందోళన: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న వలస కార్మికులు, ఉద్యోగుల ఓట్లు తొలగించబడ్డాయన్న వార్తలతో తమ స్వస్థలాలకు వచ్చి ఓటు హక్కు భద్రంగా ఉందా అని సరిచూసుకోవడం కనిపించింది. సీల్దా, కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆందోళనతో ఉన్న ఓటర్లు అనేక మంది కనిపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదేపదే హెచ్చరించడంతో తమ ఓటు హక్కు వెరిఫికేషన్ కోసం ఉద్యోగులు, అధికారులు కూడా ముందుకొచ్చారు.
పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ అంటే గతంలో హింస భయం ఉండేది. ఈసారి భయం వేరే విధంగా కనిపించింది. గతంలో పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, స్వాధీనం వంటి సంఘటనలు జరిగేవి. అయితే ఈసారి ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంది. కర్ఫ్యూ విధించకపోయినా అలాంటి వాతావరణం అనేక నియోజకవర్గాల్లో కనిపించింది. హోటళ్లు, గెస్ట్ హౌస్‌లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిపై నిఘా పెట్టి కొత్తవారిని పంపివేశారు. రాష్ట్రంలో ఈ నెల 29వ తేదీన రెండో దశ పోలింగ్ జరగనుంది. ఆ ఎన్నికల కోసం కూడా ఎన్నికల కమిషన్ ముమ్మర భద్రతా ఏర్పాట్లు చేసింది.
శాయంతన్ ఘోష్ @sayantan-gh,
రచయిత, కాలమిస్టు
