100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు

100 Calling | 8గంటల్లో ఛేదించిన ఉప్పల్ పోలీసులు
ఇద్దరు నిందితుల అరెస్ట్
100 Calling | హైదరాబాద్, ఆంధ్రప్రభ : చిలుకానగర్ హత్య కేసులో ఉప్పల్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. కేవలం 8గంటల్లో కేసును ఛేదించారు. ఉప్పల్ లోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… నిన్న రాత్రి 8 సమయంలో 100 కాల్ ద్వారా సమాచారం వచ్చిందన్నారు. చిలుకానగర్ ప్రాంతంలో పారువుల సుధీర్ కుమార్‌ను కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు సమాచారం వచ్చిందన్నారు. సుధీర్ కుమార్ ను హత్య చేసిన ప్రధాన నిందితుడు బనోతు సంతోష్ లు 7సంవత్సరాలుగా స్నేహితులు. వీరి మధ్య మూడు రోజుల క్రితం నుండి విభేదాలు ఏర్పడ్డాయి.

మార్చి 15న (నిన్న) సాయంత్రం సమయంలో సంతోష్ తన స్నేహితుడు పొడిశెట్టి తరుణ్‌తో కలిసి సుధీర్ కుమార్‌ను చిలుకానగర్ గ్రౌండ్ వద్దకు పిలిచారు. సుధీర్ తన స్నేహితుడు ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి అక్కడికి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో సంతోష్ కత్తితో సుధీర్‌పై దాడి చేయగా, సంతోష్ పారిపోవడానికి తరుణ్ తోడయ్యాడు. సుధీర్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ సంతోష్ వెంబడించి పలుమార్లు కత్తితో పొడవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారన్నారు.

కేసు నమోదు చేసిన ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేపట్టి, కేవలం 8గంటల్లోనే ప్రధాన నిందితుడు బనోతు సంతోష్, అతని సహచరుడు పొడిశెట్టి తరుణ్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రెండు మొబైల్ ఫోన్లు, ఒక యాక్టివా మోటార్ సైకిల్, వారి దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డీసీపీ ఉప్పల్ జోన్ పర్యవేక్షణలోని, ఉప్పల్ పోలీసులు, ఎస్‌ఓటీ బృందాలు త్వరగా పట్టుకున్నారు. కేసును ఛేదించిన ఉప్పల్ పోలీసులను, ఎస్ఓటి పోలీసులను డీసీపీ సురేష్ కుమార్ అభినందిస్తూ పారితోషికం అందజేశారు.

