కలెక్టరేట్ ఆవరణలో మంటలు

కలెక్టరేట్ ఆవరణలో మంటలు
-అప్రమత్తమైన అగ్నిమాపక బృందం
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కామారెడ్డి కలెక్టరేట్ లో వాహనాలకు రక్షణ లేకుండా పోతోంది. రూ.కోట్లు ఖర్చుచేసి నిర్మించిన భవంతిలో పార్కింగ్ ప్రణాళిక లేకపోవడంతో వాహనాలు ఎండకు ఎండి.. వానకు తడుస్తున్నాయి. సరైన పార్కింగ్ లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఎండాకాలం.. పైగా రోజు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కలెక్టరేట్‌కు వచ్చే ఉద్యోగులు, సాధారణ ప్రజల వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలం ఉన్నా రక్షణ లేకుండా పోతుంది. ఐదు నిమిషాలు కూడా ఎండలో నిలబడలేని పరిస్థితుల్లో ఓపెన్ పార్కింగ్ స్థలంలో వాహనాలను నిలపాలంటే భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలు అక్కడక్కడా చెట్లకింద పార్కింగ్ చేస్తున్నా కార్ల పార్కింగ్ సమస్యగా మారింది. ఎండలోనే కార్లను పార్కింగ్ చేయాల్సిన దుస్థితి నెలకొంది.
సోమవారం కలెక్టర్ కార్యాలయం పార్కింగ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దాంతో కలెక్టరేట్‌కు వచ్చిన ప్రజలు, ఉద్యోగులు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించగా ఫైర్ ఇంజన్‌తో సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. సకాలంలో స్పందించకపోయి ఉంటే పెనుప్రమాదం సంభవించేదని ప్రజలు చెబుతున్నారు.. మంటలు దట్టంగా వ్యాపించి ఉంటే పక్కనే ఉన్న కార్లు మంటల్లో కాలిపోయేవి.
అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది ఉద్యోగులకు చెప్పడంతో కార్లను అక్కడినుంచి తీసివేశారు. అయితే కలెక్టరేట్ వెనకాల కార్ల కోసం ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడ పైన షెడ్ లాంటిది ఏమి లేకపోవడంతో చెట్టుకింద నీడ చూసి అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పార్కింగ్ కోసం ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
