ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు
- ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఆవిష్కరణ
- తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన కేసీఆర్ సేవలు చిరస్మరణీయం
రాయపర్తి, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ సంబరాలు అంబరాన్నంటాయి. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.మండల కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద మండల అధ్యక్షుడు మునావత్ నరసింహ నాయక్, గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షుడు ముద్రబోయిన సుధాకర్ గులాబీ జెండాలను ఎగురవేసి అమరులకు నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిందన్నారు. ఈ పార్టీ 14 ఏళ్ల పాటు అవిశ్రాంత ఉద్యమం చేసి, మలిదశ ఉద్యమంలో లక్షలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కార్మికులు, రైతులను ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్ సాధించిన పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు.
ఆమరణ నిరాహార దీక్షతో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారని గుర్తుచేశారు. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని, ఆయన పాలనలో తెలంగాణ ‘సంక్షేమం-అభివృద్ధి’ నమూనాగా దేశానికే ఆదర్శమైందని పేర్కొన్నారు.పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని కోరారు.
కార్యకర్తల త్యాగాలు, ప్రజల ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని, కేసీఆర్ ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జీనుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పిటిసి రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు, మాజీ సర్పంచులు,మాజీ ఎంపీటీసీలు, మండల పార్టీ ముఖ్య నాయకులు, గ్రామాలలో గ్రామ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
