27april2001| 25 ఏళ్ల..సంబురం!గులాబీ పార్టీ ప్రస్థానం
27april2001| 25 ఏళ్ల..సంబురం!గులాబీ పార్టీ ప్రస్థానం
27april2001 | ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క
2001 ఏప్రిల్ 27న ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి
తెలంగాణ సాధించి రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్
27april2001 | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ (టీఆర్ఎస్) 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ పాతికేళ్ల ప్రస్థానంలో గులాబీ పార్టీ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, మరెన్నో ఉన్నత శిఖరాలను సైతం అధిరోహించింది. 25 ఏళ్ల కేసీఆర్ పార్టీ సాధించిన విజయాలను గుర్తు తెచ్చుకుంటూనే.. ఆ పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులను కూడా ఓసారి సమీక్షించే ప్రయత్నం చేద్దాం..
రాష్ట్ర సాధన.. అతిపెద్ద విజయం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట కేసీఆర్ ఓ నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఆరంభంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ టీఆర్ఎస్ వెనక్కి తగ్గలేదు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆ పార్టీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ.. ప్రజల్లో ఉద్యమ జ్వాలను రగిల్చింది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా దిగొచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించింది. చివరకు 2014లో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటైంది. ఇది టీఆర్ఎస్ సాధించిన అతిపెద్ద విజయం.

పదేళ్ల పాలనలో తెలంగాణపై తనదైన ముద్ర..
ఉద్యమ సారథి కేసీఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్.. ఫక్తు రాజకీయ పార్టీగా మారింది. తెలంగాణ అవసరాలు గుర్తెరిగిన కేసీఆర్.. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, కళ్యాణ లక్ష్మీ లాంటి వినూత్న కార్యక్రమాలు, పథకాలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. హైదరాబాద్ నగరం కూడా ఈ పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందింది. ఐటీ, ఫార్మా రంగాలు వేగంగా విస్తరించాయి. కేసీఆర్ పాలనలో గ్రామీణ ప్రాంతాల్లోనూ భూముల విలువ పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేశారు. దాదాపు పదేళ్ల పాలనలో తెలంగాణపై తనదైన మార్క్ను చూపారు.
బీఆర్ఎస్‌గా మారడంతో గట్టిదెబ్బ..
తెలంగాణలో సాధించిన విజయాలతో పార్టీని దేశమంతటా విస్తరించాలని కేసీఆర్ ఆలోచన చేశారు. దీంతో టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చారు. అయితే 2023 ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓటమి పాలైంది. అయినా సరే చెప్పుకోదగ్గ సీట్లు సాధించింది. ఓటమి తర్వాత కేసీఆర్ ప్రజల ముందుకు రావడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత 2024 లోక్ సభ ఎన్నికల్లో గులాబీ పార్టీ అనూహ్యంగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఒకప్పుడు సారు.. కారు.. పదహారు అని నినదించిన గులాబీ శ్రేణులు ఈ ఫలితం దెబ్బకు డీలా పడ్డాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌కు ఆశించిన ఫలితాలు రాలేదు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, లిక్కర్ స్కామ్, గొర్రెల పంపిణీలో అవకతవకలు మొదలైన వాటిని అధికార కాంగ్రెస్ హైలెట్ చేసింది. వీటి వల్ల బీఆర్ఎస్ ప్రతిష్ట దెబ్బతింది. గులాబీ పార్టీలోని కీలక నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు.
మళ్లీ కేసీఆర్ యాక్టివ్..
కేసీఆర్ ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా మారుతున్న తరుణంలో.. కవిత రూపంలో తన ఇంట్లో నుంచే ఆయనకు సవాల్ ఎదురవుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్.. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తే సరిపోయేది. కానీ ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తుంటే.. ఇదేమీ అనుకున్నంత ఈజీ వ్యవహారం కాదు అనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్‌లకు కవిత పార్టీ తోడైతే.. వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లోనైనా చతుర్ముఖ పోరు తప్పకపోవచ్చు. ఇది బీఆర్ఎస్‌కు ఇబ్బందికరం.
వచ్చే 25 నెలలు కీలకం..
25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో వైఫల్యాలు, ఎన్నో విజయాలను అందుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూతురి రూపంలో సరికొత్త సవాల్ను ఎదుర్కొంటోంది. 25 ఏళ్లలో ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నిలబడిన కేసీఆర్ పార్టీ వచ్చే 25 నెలలపాటు ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటుంది, ఎలాంటి పనితీరు కనబరుస్తుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రాజకీయంగా ఎంతో అనుభవం, వ్యూహాత్మకంగా వ్యవహరించే నేర్పు ఉన్న కేసీఆర్ ఇప్పటి దాకా బయటి వ్యక్తుల ఎత్తులను తిప్పికొట్టారు. ఇప్పుడు తన గారాలపట్టిని ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.
click here to read 60 ఏళ్ల స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కేసీఆర్‌దే
