ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ కు సాదర స్వాగతం
ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ కు సాదర స్వాగతం
ఈ నెల 28న శంకుస్థాపనతో పనులకు శ్రీకారం
విశాఖ వాకిట నవ్యాంధ్రుల కలలకు సాకారం*
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : నవ్యాంధ్రుల కలల సాకారానికి ప్రాధాన్యం ఇస్తూ, ఉత్తరాంధ్ర కే మణిమకుటంగా అలరారే గూగుల్ డేటా సెంటర్ కు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్య రీతి సాఫల్యం పొందడం తనకు ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అలానే పెట్టుబడుల ఆకర్షణలో భాగంగా రాష్ట్రాన్ని అగ్రగామిగా మలిచే క్రమంలో భాగంగా ఐటీ శాఖామాత్యులు, తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ కృషి అమోఘం అని, ఆయన శ్రమ అనిర్వచనీయం అని చెప్పారు. ఈ నెల 28న తర్లువాడలో 266.6 ఎకరాలలో విఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కు శంకు స్థాపన చేయడం శుభ పరిణామం అని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు . మొత్తంగా విశాఖ కేంద్రంగా మూడు చోట్ల ఏర్పాటు అయ్యే గూగుల్ డేటా సెంటర్ల కు సంబంధించి తొలి దశలో భాగంగా తర్లువాడ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థల అధినేతలు తరలి రావడం ఉత్తరాంధ్రకే సొంతం అయ్యే చారిత్రక పరిణామం అని అభిప్రాయపడ్డారు.
సమర్థ నాయకత్వానికి ప్రతిబింబం..
ఇప్పటికే విశాఖ కేంద్రం గా ఐటీ నగరం అభివృద్ధి దిశగా కాగ్నిజెంట్ తో సహా కీలక సంస్థల రాక , కార్యకలాపాల నిర్వాహణ అన్నది సమర్థనీయంగా సాగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కూటమి సర్కారు ఏర్పాటు అయి రెండేళ్లు పూర్తి కాకమునుపే ఇప్పటికే లక్ష కోట్ల పెట్టుబడులు రావడం ఆనందదాయకం అని, ఐటీ రంగానికి ఊతం ఇచ్చే దిశగా వైజాగ్ మెగా డేటా పార్కు లిమిటెడ్ పేరుతో 1.35 లక్షల కోట్ల రూపాయల నిధులతో అదానీ భాగస్వామ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు అందరి కలలకూ రూపం అని అభిప్రాయపడ్డారు. విద్యా ఉపాధి మౌలిక వసతుల కల్పన వంటి అంశాలతో ముడిపడిన ఈ ప్రాజెక్టు రూపకల్పన నవ్యాధ్ర సారథి చంద్రబాబు సమర్థతకు సంకేత రూపమని కొనియాడారు. విశాఖ కేంద్రం ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, సెమికండక్టర్ రంగాలలో పెట్టుబడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకుంటున్న చొరవ సత్ఫలితాలు ఇస్తోందని, గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ వివిధ దశలలో అటు అమెరికా కేంద్రంగానూ ఇటు విశాఖ కేంద్రంగానూ ఆయన తీసుకున్న చర్యలు పురోగామి దిశగా ఉండడం సమర్థ నాయకత్వానికి ప్రతిబింబం అని అన్నారు.
ఉత్తరాంధ్ర అంటే చంద్రబాబు నాయుడు గారికి మమకారం…
గూగుల్ హబ్ రాకతో సంబంధిత రంగాల ఆధారంగా ఏర్పాటు అయ్యే కంపెనీలలో దాదాపు రెండు లక్షల మంది వరకూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని అంచనాగా తెలిపారు. ఆ రోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ రంగ అభివృద్ధికి సంబంధించి కనీస చర్యలు లేకపోవడంతో సంబంధిత వ్యవస్థలు అన్నీ కునారిల్లాయని, మళ్లీ ఐటీ రంగం కోలుకునేందుకు ముఖ్యమంత్రితో పాటూ ఐటీ శాఖా మంత్రి తీసుకున్న నిర్ణయాల కారణంగా సంబంధిత రంగాలు అన్నీ పునరుత్తేజం చెందాయని గుర్తుచేశారు. ఆ రోజు వైసీపీ హయాంలో రాష్ట్రం పురోగామి కాకుండా తిరోగమన రూపంలో ఉండిపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయిందని, తద్వారా ఏపీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా జీరో లెవల్ కు పడిపోయిందని ఆవేదన చెందారు. కూటమి ప్రభుత్వం రాకతో కేంద్రం అందిస్తున్న చేయూత కారణంగా డబుల్ ఇంజన్ సర్కారు చేపడుతున్న చర్యలు ఫలించి, ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఐటీ రంగంతో పాటే ఫార్మా, ఇండస్ట్రియల్ సెక్టార్లలో కూడా సంబంధిత దిగ్గజ సంస్థలు రావడం ఉత్తరాంధ్రకే సంబంధిత అవకాశాలు ఎక్కువగా దక్కడం ముఖ్యమంత్రి కి ఈ ప్రాంతం అంటే ప్రేమ అని అనేందుకు నిదర్శనం అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు.
