ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా.. అందాల్సిందే..!

ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా.. అందాల్సిందే..!

— కేవలం కుల గణన చేస్తే సరిపోదు.. సంపదను పంచాలి
— సిఎం రేవంత్ రెడ్డి వైఖరిపై బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ధ్వజం

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ఎవరి కులం ఎంతో.. వారికంత వాటా.. దక్కాలనే నినాదంతోనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని తెలంగాణ స్టేట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. విశారదన్ మహారాజ్ స్పష్టం చేశారు. ఆదివారం అంబేద్కర్ సెంటర్‌లోని బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన జేఏసీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జోగ బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కుల గణన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

— సంపద పంపిణీలో అన్యాయం..

ఈ సందర్భంగా విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కులాలను లెక్కపెట్టి చేతులు దులుపుకుంటే సరిపోదని విమర్శించారు. కుల గణన అసలు పరమార్థం.. దేశ సంపదను, భూమిని, రాజ్యాధికారాన్ని ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయడమేనని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ గణతంత్ర స్ఫూర్తి అదేనని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో సంపద సమ పంపిణీ జరగడం లేదని, భూమి, రాజ్యం, అధికారాలన్నీ కేవలం ఒక్క సామాజిక వర్గానికే (రెడ్డి కులానికే) అప్పగిస్తున్నారని మండిపడ్డారు.

90 శాతం ప్రజలకే రాజ్యాధికారం లక్ష్యం..

బ్యూరోక్రసీలోనూ, మంత్రి పదవుల్లోనూ అగ్రవర్ణాలకే పట్టం కడుతున్నారని, ఇదే బాటలో గత ప్రభుత్వంతో పాటు బీజేపీ కూడా నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాధికారం దక్కే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. 10 శాతం ఉన్న అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న అధికారాన్ని బహుజనుల పరం చేయడమే జేఏసీ లక్ష్యమని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ నాదం కుమారస్వామి, జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాఘవేంద్ర ముదిరాజ్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు రాదండి దేవేందర్, దుగ్యాల స్వామి, చంద్రగిరి శంకర్, భీమనాదని సత్యనారాయణ, పొదిల సాయిబాబా, మేకల సుమన్, కొత్తూరు రవీందర్, చిట్యాల శ్రీనివాస్ తదితర బీసీ, బహుజన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply