పత్రికల ద్వారా కించపరచడం తగదు

పత్రికల ద్వారా కించపరచడం తగదు
మునుగోడు, ఆంధ్రప్రభ: మండల పరిధిలోని పలివెల గ్రామం బీసీ మహిళా సర్పంచ్ ఆమె భర్త మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజు గౌడ్ పై జరుగుతున్న ఆరోపణల ప్రచారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అధికారాన్ని, అధికారుల్ని అడ్డుపెట్టుకుని బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ కి మారాలని ఒత్తిడి తెస్తున్నారని,మారకపోతే 72 లక్షల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మాజీ సర్పంచ్ గజ్జల బాలరాజు గౌడ్ ఆరోపించారు.ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అధికారాన్ని అడ్డుపెట్టుకుని సరైన నిర్ధారణ లేకుండానే ఆరోపణలు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ వ్యవస్థలో ప్రతి పనికి పాలకవర్గ తీర్మానం,సర్పంచ్–ఉపసర్పంచ్ సంయుక్త చెక్ పవర్ అలాగే గ్రామ కార్యదర్శి, ఎంపీడీవో, ఏఈ, డీఈ, క్వాలిటీ కంట్రోల్ అధికారుల పర్యవేక్షణ వంటి విధానాలు పారదర్శకతకు బలం చేకూరుస్తాయని తెలిపారు.
ఇలాంటి వ్యవస్థ ఉన్నప్పటికీ, అవకతవకల ఆరోపణలు చేయాలంటే ముందుగా సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు నిర్ధారించడం అవసరమని అన్నారు. ఆధారాలు లేకుండా పత్రికల ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడం సమాజానికి హానికరమని,ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవడం అధికారుల బాధ్యత కాగా, వ్యక్తిగతంగా ఒత్తిళ్లు తీసుకురావడం లేదా ముందస్తు తీర్పులు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మందుల సత్యం,పోలగోని సైదులు గౌడ్,మండల సంయుక్త కార్యదర్శి మాదనబోయిన పరమేష్,మేకల శ్రీనివాస్ రెడ్డి,మారగొని అంజయ్య గౌడ్, కొండవీటి మోహన్ రెడ్డి, కొండవీటి రాంరెడ్డి,వార్డ్ మెంబర్ బత్తుల శేఖర్, మాజీ వార్డ్ మెంబర్ నాతి లింగస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
