గంజాయి మత్తులో యువత.. 20 ఏళ్లకే స్మ‌గ్లింగ్..

  • పోలీసులకు చిక్కిన యువకుడు

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక యువకుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 97 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పులి రమేష్ తెలిపారు.

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో సూరారం గ్రామ శివారులోని రిలయన్స్ గ్యాస్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో ఎస్సై నరసింహారావు తన సిబ్బందితో కలిసి అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు.

విచారణలో అతడు దండేపల్లి గ్రామానికి చెందిన చిలుక సిద్దు (20)గా గుర్తించారు. అతని వద్ద నిర్వహించిన తనిఖీల్లో సుమారు 97 గ్రాముల గంజాయి లభ్యమైంది. మహారాష్ట్ర రాష్ట్రంలోని బల్లార్షా ప్రాంతంలో గంజాయిని కొనుగోలు చేసి తన ఇంటికి తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో ఎస్సై నరసింహారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.