రిటైర్మెంట్ డబ్బుల కోసం ఉద్యోగుల ఆవేదన

రిటైర్మెంట్ డబ్బుల కోసం ఉద్యోగుల ఆవేదన
ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపడుతున్న ఉద్యోగులు
ఉద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రభుత్వం
అచ్చంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అనంతరం పొందాల్సిన ఆర్థిక చెల్లింపులు ఆలస్యమవుతున్న నేపథ్యంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం నుంచే వేల సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ అవుతున్నప్పటికీ, వారికి రావాల్సిన గ్రాచ్యుటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి బకాయిలు నెలల తరబడి చెల్లించకపోవడం వల్ల వారు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
ఉద్యోగ విరమణ నెలలోనే చెల్లించాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకపోవడంతో, కుటుంబ బాధ్యతలు, అప్పులు, ఆరోగ్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నారని ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. కొందరు ఈ పరిస్థితిని తట్టుకోలేక తీవ్ర నిరాశకు లోనవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సంఘాలు చెబుతున్నాయి.
పెన్షన్‌తో ఎలా జీవించాలి..
ఉద్యోగ విరమణ తర్వాత వేతనం సగానికి తగ్గి పెన్షన్ రూపంలో మాత్రమే అందుతుండగా, ఒకేసారి రావాల్సిన రిటైర్మెంట్ నిధులు లేకపోవడం కుటుంబాలపై ఆర్థిక భారం పెంచుతోంది. జీవితాంతం ప్రభుత్వ సేవలో గడిపిన ఉద్యోగులు చివరికి ఖాళీ చేతులతో రిటైర్ కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వంపై విమర్శలు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందనే కారణంతో చెల్లింపులు ఆలస్యం చేయడం సరైంది కాదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. “ఉద్యోగ స్వామ్యంలో ప్రభుత్వానిది తల్లిదండ్రి పాత్ర. అలాంటిది ఇలాంటి కీలక సమయంలో నిర్లక్ష్యం చేయడం బాధ్యతారాహిత్యం” అని మండిపడుతున్నాయి.
విశ్వాస సంక్షోభం…
ఈ సమస్య కొనసాగితే ప్రభుత్వంపై ఉద్యోగుల విశ్వాసం దెబ్బతింటుందని, రాష్ట్ర పరిపాలన సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కారణమైన ఆశయాలు నెరవేరుతున్నాయా అనే చర్చకు ఇది దారితీస్తుందని అభిప్రాయపడుతున్నారు.
తక్షణ చర్యలకై పిలుపు..
ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి, రిటైర్మెంట్ చెల్లింపులపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమస్యను నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
