పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

మక్తల్ (ఆంధ్రప్రభ) : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల భాగంగా బుధవారం సాయంత్రం నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పోలీసులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక సీఐ రామ్‌లాల్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన రహదారి గుండా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. అక్కడ 167వ జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో పోలీస్ అమరవీరులకు గౌరవప్రదంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సీఐ రామ్‌లాల్ మాట్లాడుతూ…. “సమాజ శ్రేయస్సు కోసం శాంతి భద్రతల పరిరక్షణలో విధులు నిర్వర్తిస్తూ ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత. వారి ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి,” అని అన్నారు.
అలాగే ప్రజల కోసం నిరంతరం సేవలందించే పోలీసులకు ప్రతి పౌరుడు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై (II) రేవతి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపిటిసి పారేవుల ఆశిరెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వినయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
