వ్యాసరచన పోటీల్లో విజయఢంకా..

వ్యాసరచన పోటీల్లో విజయఢంకా..

రాష్ట్రస్థాయిలో మెరిసిన గద్వాల మహిళా పోలీసులు
జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు

గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తూనే, మేధోపరమైన సృజనాత్మకతలోనూ తమ ప్రతిభను జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసు శాఖ మరోసారి చాటుకుంది. పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 సందర్భంగా 2025 లో రాష్ట్రవ్యాప్తంగా పోలీసు సిబ్బంది మధ్య నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా పోలీసు సిబ్బంది అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి తృతీయ బహుమతులను కైవసం చేసుకుని జిల్లా కీర్తి ప్రతిష్ఠలను నలుదిశలా చాటారు. జిల్లాలోని భరోసా సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న డబ్ల్యూఎస్‌ఐ బి. తారక, “క్రింది స్థాయిలో పోలీస్ వ్యవస్థ బలోపేతం” అనే అంశంపై లోతైన విశ్లేషణతో వ్యాసాన్ని సమర్పించి ఎస్సై మరియు ఆపై ర్యాంక్స్ విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతిని సాధించగా, మహిళా కానిస్టేబుల్ ఎ. శ్రీలత “పని ప్రదేశాల్లో లింగ వివక్షత” అనే సామాజిక అంశంపై ప్రభావవంతమైన అభిప్రాయాలను వ్యక్తం చేసి పీసీ నుండి ఎ ఎస్సై విభాగంలో రాష్ట్రస్థాయిలో తృతీయ బహుమతిని అందుకున్నారు.

ఈ విజేతలకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో 22-04-2026 న డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్., స్వయంగా ప్రశంసా పత్రాలు మరియు 10,000/- రూపాయల నగదు పురస్కారాలను చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ విజేతలను అభినందిస్తూ, సామాజిక అంశాలపై పట్టు సాధించి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్ఠను మరో మెట్టు పైకి తీసుకెళ్లడం గర్వకారణమని కొనియాడారు. జిల్లా పోలీసు అధికారులు మరియు తోటి సిబ్బంది ఈ అపురూప విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.