కొలిక్కి రాని…కో ఆప్షన్ పదవులు..?

కొలిక్కి రాని…కో ఆప్షన్ పదవులు..?

అధికారికంగా ఖరారు కాని అభ్యర్థులు
పదవులపై కొన…’సాగుతున్న’ఉత్కంఠ
తాజా మాజీలకు,విలీన గ్రామాల ప్రతినిధులకు మొండి చెయ్యి..?

మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ లో 4 కో ఆప్షన్ స్థానాలకు సంబంధించి కొలిక్కి రాకపోవడం…అధికారికంగా అభ్యర్థులను ఖరారు చేయకపోవడంతో…దరఖాస్తులు చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ కొన.. సాగుతూనే ఉంది.ఈ నెల 23 న కో ఆప్షన్ పదవులకు దరఖాస్తు తుది గడువు కాగా…మైనారిటీ కోటాలో 5 గురు,ప్రత్యేక పరిజ్ఞానం, రాజకీయ అనుభవం కలిగిన కోటాలో 11 మంది చొప్పున మొత్తం 16 మంది దరఖాస్తులు సమర్పించారు. మైనారిటీ కోటాలో మహ్మద్ అలీ , ఎం డి పర్వీన్ సుల్తానా(మార్కెట్ డైరెక్టర్ సమీర్ భార్య),ప్రజాప్రతినిధుల కోటాలో మాజీ వార్డ్ మెంబర్ ఎడ్ల శ్రీనివాస్,మాజీ వార్డ్ మెంబర్ అంబటి కవిత(ధర్మాపురం)లను ఖరారు చేస్తూ ఎమ్మెల్యే, మున్సిపల్ పాలకవర్గం, ముఖ్య నాయకులు సమిష్టి నిర్ణయం తీసుకున్నట్లు ఈ నెల 23 న బహిర్గతం అయినప్పటికీ… ఆయా అభ్యర్థులకు ఫోన్లు చేసి దరఖాస్తులు వేయండి అని చెప్పినట్లు సమాచారం.

కానీ కొంతమంది మాత్రం తమకు తామే దరఖాస్తు చేసుకోగా,మరికొంతమందికి ఎమ్మెల్యే, ముఖ్య నాయకులు, కౌన్సిలర్ల సహకారం మేరకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. గడువు ముగిసిన అనంతరం ఖరారు చేసిన అభ్యర్థుల పట్ల కొంతమంది కౌన్సిలర్లు,ముఖ్య నాయకులు ఎడ మొఖం..పెడ ముఖంగా ఉన్నారని…27 న ప్రకటించే అర్హుల జాబితా అనంతరం …కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో మెజారిటీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకునేందుకు,అనధికారికంగా ప్రకటించిన అభ్యర్థులను మార్పు చేసే దిశగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ఏది ఏమైనప్పటికీ సమిష్టి నిర్ణయం మేరకు 4 కో ఆప్షన్ స్థానాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించి ఈ ఉత్కంఠ కి తెర తీయాలని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

తాజా మాజీలకు ,విలీన గ్రామాలకు మొండి చెయ్యి..?

మున్సిపల్ కో ఆప్షన్ పదవులకు పార్టీ కోసం కట్టుబడి పనిచేసిన తాజా మాజీ కౌన్సిలర్లు,కో ఆప్షన్ సబ్యులకు ,విలీన గ్రామాల మాజీ ప్రజాప్రతినిధుల కు ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే పలువురు దరఖాస్తు చేశారు. విలీన గ్రామాలైన కొండగడప, బుజిలాపురం లలో కాంగ్రెస్,సీపీఐ కౌన్సిలర్ అభ్యర్థులు ఓటమి పాలు కావడంతో విలీన గ్రామాల్లో కో ఆప్షన్ పదవి ఇచ్చి ప్రాతినిధ్యం కల్పించాలని ఆయా గ్రామాల పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.ప్రత్యేక పరిజ్ఞానం కలిగిన కోటాలో తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని రిటైర్డ్ ఎం ఈ ఓ మన్నే అంజయ్య సైతం కొందరి మౌఖిక ఆదేశాల మేరకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఎవరికి వారే …యమునా తీరే అన్న చందంగా… మున్సిపల్ కో ఆప్షన్ పదవుల కోసం ఎమ్మెల్యే, ,చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు,అభ్యర్థులలో తాజగా రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply