భక్తుల సంతృప్తియే ముఖ్యం..

భక్తుల సంతృప్తియే ముఖ్యం..
దేవాలయాల్లో సౌకర్యాల మెరుగుదల చేయండి..
దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : దేవాలయాలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాల పట్ల వారి సంతృప్తి స్థాయిని మరింత పెంచడమే లక్ష్యంగా దేవదాయ శాఖ ఉన్నతాధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం దేవదాయ శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ వివిధ ఆలయాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో దర్శన ఏర్పాట్లు, అన్నప్రసాదం, ఉచిత ప్రసాదాల నాణ్యత, మంచినీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులు పారిశుధ్యంపై భక్తుల నుండి కనీసం 80 శాతం సానుకూల స్పందన రావాలని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి పరిశీలన…
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం భౌగోళికంగా కొన్ని ఇబ్బందులు కలిగి ఉన్నప్పటికీ, రాజధాని ప్రాంతంలోని ప్రధాన ఆలయం కావడంతో భక్తులకు అత్యుత్తమ సేవలందించాలని ఆదేశించారు. ఈవో నుండి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో భక్తులతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
అధునాతన సాంకేతికత – నాణ్యమైన సేవలు..
అన్నప్రసాదం తయారీలో అధునాతన సాంకేతికతను ఉపయోగించి రుచిగా, నాణ్యంగా, త్వరితగతిన వంటలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా భక్తులకు మంచినీటి సదుపాయం వేసవి ప్రత్యేక ఏర్పాట్లలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని ఆదేశించారు.
సిబ్బంది ప్రవర్తన…
భక్తులతో సిబ్బంది ప్రవర్తన అత్యంత వినయపూర్వకంగా, మెచ్చుకోదగ్గ రీతిలో ఉండాలని స్పష్టం చేశారు. భక్తుల పూర్తి స్థాయి సంతృప్తి సాధించడమే మన ధ్యేయం. క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి. డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో దుర్గమ్మ గుడి కార్యనిర్వహణాధికారి శీనా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
