ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి

ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి

  • జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కలిసి పలు కీలక అంశాలను వినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి 2020లో మంజూరైన 8 వెంటిలేటర్లు ఇప్పటికీ సాంకేతిక లోపాలు, సిబ్బంది కొరత కారణంగా పనిచేయకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

సెంట్రల్ ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, నిపుణులైన టెక్నీషియన్లు అందుబాటులో లేకపోవడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటిలేటర్లను తక్షణమే పనిలోకి తీసుకురావాలని మంత్రిని కోరినట్లు వెల్లడించారు. అదేవిధంగా, జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో డయాలిసిస్ సేవలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్నదని చెప్పారు. ప్రస్తుతం 10 డయాలిసిస్ యంత్రాలతోనే సేవలు అందిస్తుండగా, రోజుకు సుమారు 40 మంది రోగులు వేచి ఉండాల్సి వస్తోందని వివరించారు.

నెలకు సుమారు 900 డయాలిసిస్ సెషన్లు నిర్వహిస్తున్నప్పటికీ అవసరాలకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి అదనంగా 6 డయాలిసిస్ యంత్రాలు, అవసరమైన సిబ్బందిని మంజూరు చేయాలని, అలాగే కోహీర్ ఆసుపత్రికి 5 డయాలిసిస్ యంత్రాలు ఏర్పాటు చేయాలని మంత్రిని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీంతో రోగులపై ఉన్న ఒత్తిడి తగ్గి, వైద్య సేవలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే మాణిక్‌రావు తెలిపారు.