గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్ట్..

33 గ్రాముల గంజాయి స్వాధీనం

శివ్వంపేట, ఆంధ్రప్రభ: గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను శివ్వంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 33 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని గ్యాస్ గోదాం సమీపంలో గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ఎస్సై మధుకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.

ఈ క్రమంలో శబాష్‌పల్లి గ్రామానికి చెందిన మార్తమన్ గణేష్, తూప్రాన్‌కు చెందిన గౌర హమేత్ సింగ్ వద్ద గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో మండలంలోని కొందరికి గంజాయి విక్రయించేందుకు వచ్చినట్లు విచారణలో వెల్లడైందని ఎస్సై తెలిపారు.

గంజాయిని సీజ్ చేసి, నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.