రక్త దానం.. ప్రాణదానం

రక్త దానం.. ప్రాణదానం
- జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వరరావు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రక్త దానం.. ప్రాణదానంతో సమానమని జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వరరావు అన్నారు. అగ్నిమాపక సేవల వారోత్సవాల సందర్భంగా గురువారం సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సంగారెడ్డి అగ్నిమాపక కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో అగ్నిమాపక సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.
సమాజ సేవ పట్ల తమ బాధ్యతను చాటిచెప్పే విధంగా అనేక మంది ముందుకు వచ్చారు. ప్రతి సంవత్సరం నిర్వహించే అగ్నిమాపక సేవల వారోత్సవాల ప్రధాన ఉద్దేశం అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపు, అగ్నిమాపక సిబ్బంది సేవలను స్మరించుకోవడం అని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా ప్రాణరక్షణలో భాగస్వామ్యం కావాలని శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, నివాస ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ఎల్పీజీ భద్రత, విద్యుత్ భద్రత, నిర్లక్ష్య ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ స్వచ్ఛంద రక్తదానం ప్రాముఖ్యతను వివరించి, రక్తదాతలను అభినందించారు. అగ్నిమాపక శాఖ అత్యవసర సేవలతో పాటు సమాజ సేవలోనూ ముందుంటుందని పేర్కొన్నారు. శిబిరంలో వైద్య బృందం భద్రతా ప్రమాణాలతో రక్త సేకరణ నిర్వహించి, రక్తదాతలకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ అగ్నిమాపక శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో పలువురు అగ్నిమాపక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
