పీఆర్సీ ప్రకటించి పెండింగ్ బిల్లులు చెల్లించాలి

  • త‌ప‌స్ జిల్లా అధ్య‌క్షుడు కె.ద‌త్తాత్రి

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని ప్రకటించి ఆరు డీఏలను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) సంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం కలెక్ట‌రేట్ గేట్ వ‌ద్ద భారీ ర్యాలీగా వ‌చ్చి ధ‌ర్నా నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని పెండింగ్ బిల్లులను పూర్తిగా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్ర‌భుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించి 51 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని సూచించారు. ఆరు డీఏల విడుదల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం వల్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

పెన్షనర్లకు రావాల్సిన అన్ని ప్రయోజనాలను జాప్యం లేకుండా అందించాలని, కేజీబీవీ, ఎస్‌ఎస్‌ఏ మహిళా ఉపాధ్యాయులు, సిబ్బందికి సమ్మె కాలపు వేతనాలు చెల్లిస్తూ ఎంసీటీఎస్‌ను అమలు చేయాలని అన్నారు. మోడల్ స్కూల్ 010 పద్దు అంశంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని, జీవో 190ను విద్యాశాఖలో పూర్తిస్థాయిలో అమలు చేసి అప్పీల్ చేసుకున్న వారందరికీ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.

2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు సీఎం ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేసి, సుప్రీంకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో త‌ప‌స్ రాష్ట్ర‌ కార్య‌ద‌ర్శి ర‌మేష్‌, రాష్ట్ర కోశాధికారి భాస్కర్ దేశ్, జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.సుధాక‌ర్‌, విజయ్ కుమార్, కె.స్వ‌రూప‌రాణి, చంద్ర‌శేఖ‌ర్ ఆచార్య‌, ఎస్‌.విజ‌య‌ల‌క్ష్మితోపాటు భారీగా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.