భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి

భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలి
- పోతిరెడ్డిపల్లిలో పేద రైతుల భూముల వ్యవహారంలో కలకలం
- డబ్బులు కూడా పూర్తిగా ఇవ్వలేదని ఆరోపణలు
- మీడియా ముందు కన్నీటి పర్యంతమైన బాధిత రైతులు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ:
సంగారెడ్డి పట్టణ పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్వే నంబర్లు 153, 154, 155లో పేద రైతుల భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్న రైతులు తమకు మోసం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల విలువ పెరగడంతో కొందరు భూ దందాదారులు పేద రైతులను లక్ష్యంగా చేసుకుని భయపెట్టి భూములు కాజేశారని బాధితులు ఆరోపించారు.
బాధిత రైతుల కథనం ప్రకారం.. సాగర్ అనే వ్యక్తి మరికొందరితో కలిసి “ప్రభుత్వం మీ భూములను స్వాధీనం చేసుకోబోతోంది.. ఇప్పుడే అమ్మకపోతే నష్టపోతారు” అంటూ రైతులను భయాందోళనలకు గురిచేశారని తెలిపారు. ఈ క్రమంలో తక్కువ ధరలకు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఎకరానికి రూ.1.20 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి, కేవలం రూ.70 లక్షలు మాత్రమే చెల్లించారని, మరికొందరికి ఆ మొత్తాన్ని కూడా పూర్తిగా ఇవ్వలేదని వాపోయారు.
తమకు జరిగిన అన్యాయంపై స్థానిక 11వ వార్డు కౌన్సిలర్ దశరథ్ రెడ్డిని ఆశ్రయించగా, ఆయన బాధిత కుటుంబాలతో కలిసి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రైతులు మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. “మా జీవనాధారం అయిన భూములు పోయాయి.. ఇప్పుడు మేమెలా బతకాలీ” అంటూ విలపించారు.
సుమారు 50 ఎకరాల భూమికి సంబంధించిన ఈ వ్యవహారంలో దాదాపు 80 కుటుంబాలు నష్టపోయాయని బాధితులు తెలిపారు. భూములు తీసుకున్న తర్వాత కూడా మిగిలిన డబ్బులు ఆరు నెలల్లో ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు చెల్లించలేదని ఆరోపించారు. అంతేకాకుండా తమ భూములపై డబుల్ రిజిస్ట్రేషన్లు చేసి ఇతరులకు విక్రయించారని కూడా సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కౌన్సిలర్ దశరథ్ రెడ్డి.. “న్యాయవాదులమని చెప్పుకుంటూ నోటీసులు పంపించి, ప్రభుత్వం భూములు గుంజుకుంటుందని పేద రైతులను భయపెట్టారు. ఇదంతా పక్కా ప్రణాళికతో చేసిన మోసం. రైతులకు జరిగిన అన్యాయంపై ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటాం” అని స్పష్టం చేశారు.
రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, త్వరలోనే జిల్లా కలెక్టర్‌ను కలిసి పూర్తి వివరాలు తెలియజేసి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడతామని తెలిపారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.
