అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ ..

అబ్బుర పరిచేలా కొండపల్లి బొమ్మల పండుగ ..

  • స‌మ‌ష్టి కృషితో విజ‌య‌వంతం చేద్దాం
  • ఎల్లుండి ఉదయం ఆరు గంటలకు కొండపల్లి ఖిల్లాపైకి ట్రెక్కింగ్
  • ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని బొమ్మల పండుగ ప్రారంభం
  • ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ‌

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా ప‌ర్యాట‌క ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ నెల 18న ప్ర‌పంచ వార‌స‌త్వ దినోత్స‌వం సంద‌ర్భంగా నిర్వ‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల‌ను వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి విజ‌య‌వంతం చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్ జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియాతో క‌లిసి రెవెన్యూ, ప‌ర్యాట‌కం, పోలీసు, వైద్య ఆరోగ్యం, మునిసిప‌ల్‌, విద్యుత్‌, అగ్నిమాప‌క త‌దితర శాఖ‌ల అధికారులతో వ‌ర్చువ‌ల్ స‌మావేశం నిర్వ‌హించారు.

అనంత‌రం కొండ‌ప‌ల్లి పట్టణంలోని ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ ప్రాంతాన్ని సంద‌ర్శించారు. కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పండుగకు చేస్తున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మాల‌కు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ నెల 18వ తేదీ ఉద‌యం 6 గంటలకు కొండ‌ప‌ల్లి ఖిల్లాపైకి హెరిటేజ్ ట్రెక్కింగ్ ఉంటుంద‌ని క‌లెక్ట‌ర్ తెలిపారు. మినీ మార‌థాన్‌, సైక్లింగ్‌, యోగా సెష‌న్స్‌, సంప్ర‌దాయ క్రీడ‌లు వంటివి కూడా వేడుక‌ల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు.

వేడుక‌ల్లో భాగంగా కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల‌తో మేళా ఏర్పాటు చేస్తున్నామని, ఇది 20వ తేదీ వరకు కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు. వార‌స‌త్వ సంస్కృతి, ఆధునిక జెన్ జెడ్‌, పండ‌గ‌లు, సుస్థిర అభివృద్ధి త‌దిత‌ర అంశాల‌పై మార్చి 8న కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల పోటీ నిర్వ‌హించామని, ఇందులోని విజేత‌లకు కొండ‌ప‌ల్లి బొమ్మ‌ల మేళా కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా రూ.ల‌క్ష విలువైన బ‌హుమ‌తులు, స‌ర్టిఫికెట్లు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

ఇండియ‌న్ నేష‌న‌ల్ ట్ర‌స్ట్ ఫ‌ర్ ఆర్ట్ అండ్ క‌ల్చ‌ర‌ల్ హెరిటేజ్ (ఐఎన్‌టీఏసీహెచ్‌) భాగ‌స్వామ్యంతో విజ‌య‌వాడ న‌గ‌రంలో హెరిటేజ్ వాక్ కార్య‌క్ర‌మాన్ని కూడా నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా 18వ తేదీ రాత్రి ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానం ప‌క్క‌న ఖాళీ స్థ‌లంలో సంగీత ఝ‌రి మ్యూజిక‌ల్ ఈవెంట్‌తో సంస్కృతీ వారసత్వానికి ప‌ట్టం క‌ట్టే కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌ని తెలిపారు.

కార్య‌క్ర‌మాల్లో ఇన్‌టాక్‌, రెడ్‌క్రాస్‌, వాస‌వ్య మ‌హిళా మండ‌లి, గాంధీ స్మార‌క‌నిధి, కొండ‌ప‌ల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ త‌దిత‌ర సంస్థ‌లు కూడా భాగ‌స్వామ్య‌మ‌వుతున్న‌ట్లు వివ‌రించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శిల్ప, కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్ చైర్మన్ చుట్టుకుదురు శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply