అంతరిక్ష రంగంలో నవశకం..

అంతరిక్ష రంగంలో నవశకం..
ఐఐటీ తిరుపతిలో మేధోమథనం
నేటి నుంచి రెండ్రోజుల పాటు ఎంఎఫ్ఎఫ్ కేర్ సదస్సు
దేశీయ అంతరిక్ష రంగానికి నిపుణుల తయారీయే లక్ష్యం
ఏర్పేడు ఐఐటీ వేదికగా నిపుణుల చర్చా వేదిక
ఏర్పేడు, ఆంధ్రప్రభ : భారతదేశ అంతరిక్ష రంగం శరవేగంగా దూసుకుపోతున్న తరుణంలో, ఈ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఐఐటీ తిరుపతిలో కీలక సదస్సు నిర్వహించనున్నారు. మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్, ఐఐటీ తిరుపతి సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశ అంతరిక్ష ఇంజనీరింగ్ శ్రామిక శక్తి నిర్మాణం అనే అంశంపై శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక చర్చా వేదిక జరగనుంది.
కొత్త విభాగానికి శ్రీకారం:
ఐఐటీ తిరుపతిలో త్వరలో ఏర్పాటు చేయబోయే స్కూల్ ఆన్ స్పేస్ సైన్స్, టెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ విభాగానికి సంబంధించి ఒక సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్తులో అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను ఇక్కడి నుంచే తయారు చేసేందుకు ఈ విభాగం ఎంతగానో ఉపయోగపడనుంది.
మేధావుల సమాలోచన:
ఈ రెండ్రోజుల సదస్సులో విద్యావేత్తలు, ప్రభుత్వ విధానకర్తలు, పారిశ్రామిక వేత్తలు, కొత్తగా వస్తున్న అంకుర సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యప్రణాళిక, ఉపాధి అవకాశాలు, సాంకేతిక నైపుణ్యాల పెంపుపై వీరు లోతుగా చర్చించనున్నారు.
సదస్సు ప్రణాళిక:
తొలిరోజు వివిధ వర్గాల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరిస్తారు. రెండో రోజు మొదటిరోజు జరిగిన చర్చల సారాంశాన్ని విశ్లేషించి, అంతరిక్ష విజ్ఞానంపై నిపుణుల ఉపన్యాసాలు నిర్వహిస్తారు. అనంతరం సంస్థాగత భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. ఈ కార్యక్రమానికి మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ చైర్మన్ రాహుల్ మెహతా, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కే ఎన్ సత్యనారాయణ ముఖ్య నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. 2006 నుంచి విద్యా వికాసానికి ఎనలేని కృషి చేస్తున్న మెహతా ఫౌండేషన్, ఇప్పుడు అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
