Dehydration | తలనొప్పికి కారణాలు…

Dehydration | తలనొప్పికి కారణాలు…
Dehydration | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : నీడలోంచి ఎండలోకి అడుగు పెట్టగానే కొంత మందికి తల బరువెక్కినట్టుగా, కాసేపటికి తల నొప్పి మొదలవుతుంది. అది మరీ తీవ్రమైన ఎండ కాకపోయినా సరే… ఇంత త్వరగా ఎందుకు ఇలా అవుతుంది? మామూలుగా తమకు ఎండ పడట్లేదేమో అనుకుని చాలామంది అనుకుంటారు. కానీ ఇది సాధారణ విషయం కాదని వైద్యులు చెబుతున్నారు. శరీరం వేడిని ఎలా తట్టుకుంటుందన్న దాని పైనే ఇది ఆధారపడి ఉంటుంది.
ఈ సమస్య ఎక్కువగా బయట పని చేసే వారు, ఎక్కువ సేపు ఎండలో తిరిగే ఉద్యోగులు, చిన్న పిల్లలు, వృద్ధులు, అలాగే నీళ్లు తక్కువగా తాగే వారిలో ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా వేసవిలో ఉదయం 10 తర్వాత నుంచి సాయంత్రం వరకు బయట ఉండేవారిని ఈ సమస్య మరింతగా వేధిస్తుంది. ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడానికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. అంటే శరీరంలో నీటి శాతం తగ్గి పోవడం. చెమటగా నీరు బయటికి వెళ్లిపోతూ, తిరిగి దానికి తగినంతగా అవసరమైన ద్రవాలు తిరిగి తీసుకోక పోతే మెదడుకు రక్త ప్రసరణలో చిన్న మార్పులు వచ్చి తలనొప్పి మొదలవుతుంది. మరో కారణం సూర్యకిరణాల వేడి నేరుగా తలపై పడటం.

ఇది తల నరాలను ప్రభావితం చేస, తలనొప్పిని పెంచుతుంది. కొందరిలో వేడి కారణంగా బీపీ మార్పులు, కంటి ఒత్తిడి కూడా తల నొప్పికి దారి తీస్తాయి. మరో ముఖ్య కారణం కూడా ఉంది.అదేమిటంటే, ఒక్కసారిగా చల్లని గదిలో నుంచి తీవ్ర ఎండ లోకి వెళ్లడం వల్ల శరీరం ఒక్కసారిగా ఆ ఉష్ణోగ్రత మార్పును తట్టుకోలేక ఆ ఒత్తిడికి ప్రతిస్పందనగా తలనొప్పి మొదలవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమయితే వడదెబ్బకు ముందు కనిపించే హెచ్చరికగా కూడా గుర్తించి జాగ్రత్త పడాలి. ఈ సమస్యను తేలికగా తీసుకోకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సులభంగా నివారించవచ్చు.

బయటకు వెళ్లే ముందు తగినంత నీరు తాగడం, మధ్య మధ్యలో మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవడం చాలా అవసరం. తలకు నేరుగా ఎండ తగలకుండా టోపీ లేదా గుడ్డ వాడటం మంచిది. ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి వస్తే మధ్యలో నీడలో విశ్రాంతి తీసుకోవాలి. అలాగే ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లడం చేయకూడదు..

తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. కళ్లకు సన్ గ్లాసెస్, శరీరానికి వదులుగా ఉండే బట్టలు వేసుకోవడం కూడా ఉపశమనాన్ని ఇస్తాయి. ఎండలో తలనొప్పి చిన్న విషయం లాగే అనిపించినా, అది శరీరం ఇస్తున్న హెచ్చరిక. దాన్ని పట్టించుకోకపోతే వడ దెబ్బ లాంటి పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
CLICK HERE TO READ MORE : Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…
