రూ.2,200 కోసం హత్య..
మూడు రోజుల్లో నిందితుడు అరెస్ట్
బంగారుపాళ్యం పోలీసుల వేగవంతమైన దర్యాప్తు.. ఎస్పీ అభినందనలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : బంగారుపాళ్యం మండలం ఠగ్గువారిపల్లిలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించి, పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పూర్ జిల్లాకు చెందిన రోహిత్ భాస్కర్ ఖడ్గి (31)ను అదుపులోకి తీసుకున్నట్లు బంగారుపాళ్యం ఇన్స్పెక్టర్ కత్తి శ్రీనివాసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.
పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన సంతోష్ ధర్మదాస్ వర్మ (మృతుడు), రోహిత్ భాస్కర్ ఖడ్గి, అబ్దుల్ హబీబ్ రాయిన్ తదితరులు నెలన్నర క్రితం బంగారుపాళ్యం మామిడి మార్కెట్లో వ్యాపారం, కూలి పనుల కోసం వచ్చి ఠగ్గువారిపల్లి గ్రామంలోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో కలిసి నివసిస్తున్నారు.
ఈ నెల 11న సంతోష్‌కు రావాల్సిన రూ.17,300 కూలి డబ్బు రోహిత్ ఫోన్‌పే ఖాతాలో జమైంది. సంతోష్ సూచన మేరకు కొంత మొత్తాన్ని ఇతరులకు పంపించిన తర్వాత మిగిలిన రూ.2,200 విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ మద్యం సేవించి ఉండటంతో వివాదం ఘర్షణకు దారితీసింది.
ఆవేశానికి లోనైన రోహిత్ ఇంట్లో ఉన్న వంటగది కత్తితో సంతోష్ ఛాతీలో పొడవడంతో తీవ్ర రక్తస్రావానికి గురై కుప్పకూలాడు. అనంతరం నిందితుడు తన యజమాని అబ్దుల్ హబీబ్ రాయిన్‌కు సమాచారం ఇవ్వగా, ఇద్దరూ కలిసి బాధితుడిని బంగారుపాళ్యం ప్రభుత్వ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
మృతుడి భార్య దివంతి సంతోష్ వర్మ ఫిర్యాదు మేరకు బంగారుపాళ్యం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం బంగారుపాళ్యం–ఆరగొండ రోడ్డులోని ఆరగొండ ఫ్లైఓవర్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరాన్ని ఒప్పుకోవడంతో న్యాయస్థానంలో హాజరుపరచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
