అక్షర్ స్పిన్ దెబ్బ.. ఇంగ్లండ్ ఆలౌట్.!
- అక్షర్ స్పిన్‌లో ఇంగ్లండ్ విలవిల..
- తొలి వన్డేలో భారత బౌలర్ల జోరు..
- రూట్ ఒంటరి పోరాటం..
- భారత్ విజయ లక్ష్యం 259 పరుగులు
ఆంధ్రప్రభ, స్పోర్ట్స్ డెస్క్ : భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే ఆలౌటైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 47.5 ఓవర్లలో 258 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 259 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీయగా.. గూర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బెన్ డకెట్, జాకబ్ బెథెల్ మంచి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 968 రోజుల విరామం తర్వాత వన్డేల్లోకి తిరిగొచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా తొలి స్పెల్‌ను ఇంగ్లండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఎదుర్కొన్నారు. అయితే 13వ ఓవర్లో గూర్నూర్ బ్రార్ మ్యాచ్ ని తిప్పేశాడు.
తొలుత జాకబ్ బెథెల్‌ను 14 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపిన గూర్నూర్.. అదే ఓవర్లో ప్రమాదకరంగా కనిపిస్తున్న బెన్ డకెట్‌ను 43 పరుగుల వద్ద ఔట్ చేశాడు. 61 పరుగులకు వికెట్ నష్టపోని ఇంగ్లండ్.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి 80 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకుంది.
కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక్క పరుగుకే బుమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. తన 200వ వన్డే ఆడుతున్న జోస్ బట్లర్ ఐదు పరుగులకే పరిమితమయ్యాడు. సామ్ కరన్ పరుగుల ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. విల్ జాక్స్ 20 పరుగులు చేసి వెనుదిరగడంతో ఇంగ్లండ్ 107 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
రూట్–డాసన్ భారీ భాగస్వామ్యం
ఈ దశలో జో రూట్, లియామ్ డాసన్ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరూ ఏడో వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. డాసన్ 83 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 68 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జో రూట్ చివరి వరకు క్రీజులో నిలిచాడు. 76 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 76 పరుగులు చేశాడు. అయితే మరో ఎండ్‌లో సహకారం లేకపోవడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
అక్షర్‌కు నాలుగు వికెట్లు..
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 9.5 ఓవర్లలో 62 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ప్రసిద్ధ్ కృష్ణ 50 పరుగులకు రెండు వికెట్లు, గూర్నూర్ బ్రార్ 61 పరుగులకు రెండు వికెట్లు తీశారు. జస్‌ప్రీత్ బుమ్రా, శివమ్ దూబే చెరో వికెట్ సాధించారు. చివర్లో జోఫ్రా ఆర్చర్ 6 బంతుల్లో 12 పరుగులు చేసినా.. అక్షర్ వరుసగా ఇంగ్లండ్ లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. భారత్ తొలి వన్డేలో విజయం సాధించాలంటే 259 పరుగులు చేయాల్సి ఉంది.
