పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి…
సిపిఎం నాయకులు
లావేరు, ఆంధ్రప్రభభ : అకాల వర్షం వల్ల పంటలు నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. బుడుమూరు గ్రామంలో ఇటీవల భీభత్సమైన గాలులతో కూడిన అకాల వర్షం వలన నష్టపోయిన పంటలను సిపిఎం, సిఐటియు రైతు సంఘం బృందం బుధవారం పరిశీలించింది.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ఇటీవల కురిసిన వడగళ్ల వాన, 90 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో వందల ఎకరాలు మొక్కజొన్న, అరటి, నువ్వుసేను, మిరప పంటలు నేలపాలు అయ్యాయని అన్నారు. రైతాంగం వడ్డీలకు అప్పులు చేసి పెట్టుబడి పెట్టి, యూరియా బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు కొని ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చే సమయంలో ఈ విధంగా నష్టం జరగడంతో రైతాంగానికి తీరని నష్టమని పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని అన్నారు.
జిల్లాకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు ఇంత వరకు స్పందించ లేదని విమర్శించారు. ఎకరా మొక్క జొన్నకు 50వేల రూపాయలు, అరటికి లక్ష రూపాయలు, మిరపకి లక్ష రూపాయలు, నువ్వులకు 5 వేలు, వరి పంటకు 50వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే క్ష్రేత్రస్థాయిలో పర్యటించి పంటనష్టాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి పంపి, బాధిత రైతులకు పూర్తి స్థాయిలో పంట నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ పర్యటనలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు జిల్లా కార్యదర్శి యన్.వి రమణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పి. చందర్రావు, కౌలు రైతులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమల. రమణ, రైతులు ప్రగాడ సురేష్, పి వాసు, జల్లు అప్పలరాజు, కొన్ని శేఖర్, ఎస్ శ్రీను, పి రమణ, యం అప్పలరాజు, యం తవిటయ్య, పి శివ కనకల సూరి, బొడ్డ రవిబాబు, యమ్ సత్యరాజు, ఎస్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
