సైబర్ నేరాల పై అప్రమత్తతే రక్షణ..

సైబర్ నేరాల పై అప్రమత్తతే రక్షణ..
-అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
-సైబర్ మోసాలపై 1930కు ఫిర్యాదు చేయాలి
-అనుమానాస్పద ఘటనలపై 100కు సమాచారం ఇవ్వాలి
-ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
-ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ మోసాలు, మూఢనమ్మకాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం
-ముఖ్యఅతిధిగా పాల్గొన్న ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : సమాజంలో పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ ఐపీఎస్ అధికారి మనీషా నెహ్రా పేర్కొన్నారు. సోమ వారం రాత్రి స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని తానేదార్‌పల్లి గ్రామంలో వరంగ ల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, డ్రగ్స్ వినియోగం, మూఢనమ్మకాలు, మద్యపానం వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మనీషా నెహ్రా మాట్లాడుతూ.. ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అధికమవుతు న్నాయని తెలిపారు. గుర్తు తెలియని లింకులు, సందేహాస్పద కాల్స్, ఓటీపీ వివరాలు పంచుకోవడం వల్ల ఆర్థిక నష్టం కలగవచ్చని హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికలలో అపరిచితులతో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దన్నారు. బ్యాంక్ సంబంధిత వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పవద్దని సూచించారు. అదే విధంగా గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే లేదా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైనప్పుడు ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ కు ఫిర్యాదు చేస్తే త్వరితగతిన చర్యలు తీసుకోవచ్చని చెప్పారు.
అనంతరం సీఐ వేణు మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత అని తెలిపారు. హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ ఉపయోగించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. చిన్న తప్పిదాలు పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయని హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన ఈ చర్యలు బాలల భవిష్యత్తును నాశనం చేస్తాయని, అలాంటి ఘటనలు ఎక్కడైనా గమనించినా వెంటనే అధికారులకు తెలియజేయాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ వినియోగం యువతను తప్పుదారి పట్టిస్తుందన్నారు. కుటుంబాలను దెబ్బతీస్తుందని వివరించారు.
ఈ కార్యక్రమం పోలీస్ కళాబృందం ద్వారా మూఢన మ్మకాల వల్ల కలిగే దుష్పరిణామాలను నాటికల రూపంలో ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్ కుమార్, సర్పంచ్ మంతెన హరిత ఇంద్రా సేనారెడ్డి, ఉప సర్పంచ్ గాదె శాంత భాస్కర్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, పోలీస్ కళాకారుల బృందం తదితరులు పాల్గొన్నారు.
