ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలి..

తొర్రూరు, ఆంధ్రప్రభ : జులై 1న కొడంగల్‌లో నిర్వహించనున్న లంబాడా హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) 30వ ఆవిర్భావ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాటోత్ బాలు నాయక్ పిలుపునిచ్చారు.

శుక్రవారం మండలంలోని అమర్‌సింగ్ తండాలో నిర్వహించిన కార్యక్రమంలో ‘చలో కొడంగల్’ సభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎల్‌హెచ్‌పీఎస్ 30వ ఆవిర్భావ మహాసభ కొడంగల్‌లో జరగనున్న నేపథ్యంలో ప్రతి లంబాడా జాతి బిడ్డ భారీ సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని కోరారు.

లంబాడా జాతి ఆత్మగౌరవం, హక్కులు, రాజ్యాధికార సాధన లక్ష్యంగా మారోజు వీరన్న ఆలోచనలతో 1997 జులై 1న లంబాడా హక్కుల పోరాట సమితి స్థాపించబడిందని తెలిపారు. 29 సంవత్సరాల పోరాట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎల్‌హెచ్‌పీఎస్ ఇప్పుడు 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతోందన్నారు.

ఈ సందర్భంగా పలు డిమాండ్లను ఆయన ప్రభుత్వాల దృష్టికి తీసుకువచ్చారు. ఎస్టీలు సాగు చేస్తున్న లావోణి (లావణి) మరియు పోడు భూములకు శాశ్వత హక్కులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్టీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి పెరిగిన జనాభా ప్రాతిపదికన 14 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా బోర్బోలి (గోర్‌బోలి) భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చి అధికారిక గుర్తింపు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా ఉన్న బంజారాలను బీస్ట్ (Best) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. లంబాడా జాతి భవిష్యత్తు, హక్కుల పరిరక్షణ, రాజ్యాధికార సాధన కోసం కొడంగల్ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు జె. బిచ్చ నాయక్, సూర్య నాయక్, మిట్టు నాయక్, కౌసల్య లక్ష్మి, నరేందర్ నాయక్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.