పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం!

పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం!
ఘనంగా గ్రాండ్ ఆలుమ్నీ మీట్ – 2026
ఆలుమ్నీ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఎస్బీటీఈటీ కార్యదర్శి పుల్లయ్య
కళాశాల అభివృద్ధికి రూ. లక్ష విరాళం అందజేత
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆదివారం పూర్వ విద్యార్థుల సందడితో కళకళలాడింది. కళాశాల ఆవరణలో నిర్వహించిన ‘గ్రాండ్ ఆలుమ్నీ మీట్ – 2026’ కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా సాగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్బీటీఈటీ) కార్యదర్శి శ్రీ ఎ. పుల్లయ్య హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. దేవేందర్ ఈ సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పుల్లయ్య ఆలుమ్నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌తో పాటు, పూర్వ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తాము చదువుకున్న విద్యాసంస్థల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమ్మేళనానికి సుమారు 600 మంది పూర్వ విద్యార్థులు, 200 మంది ప్రస్తుత విద్యార్థులు హాజరయ్యారు. అలాగే గతంలో ఇక్కడ పనిచేసిన వివిధ కళాశాలల నుండి 60 మంది అధ్యాపకులు విచ్చేసి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నూతనంగా ఎన్నికైన ఆలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ ఎ. వినోద్ కళాశాల అభివృద్ధి కోసం తన వంతుగా రూ. 1లక్ష విరాళాన్ని ప్రిన్సిపాల్‌కు అందజేశారు. అదేవిధంగా ప్రస్తుత విద్యార్థుల కోసం క్రీడా సామగ్రిని బహుకరించారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు చాటుకున్నారు. కళాశాల పట్ల తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఆలుమ్నీ సభ్యులు తీర్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

