సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్ర‌దాత‌..

సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్ర‌దాత‌..

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయ‌న సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయం
ఆయ‌న ఆశ‌యాలు, ఆద‌ర్శాల స్ఫూర్తితో ముంద‌డుగు వేద్దాం
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు

ఆంధ్రప్రభ విజయవాడ రూరల్ : బ‌డుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘసంస్కర్త, రాజకీయవేత్త, దేశ మాజీ ఉప ప్ర‌ధాని, స‌మ‌తావాది శ్రీ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని.. ఆయ‌న ఆశ‌యాలు, ఆద‌ర్శాల స్ఫూర్తితో ప్ర‌తిఒక్క‌రూ ముంద‌డుగు వేద్దామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, గ‌న్న‌వ‌రం శాస‌న‌స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు అన్నారు. శ్రీ బాబు జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జ‌యంతి మహోత్స‌వం సంద‌ర్భంగా స్థానిక రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో ఆదివారం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు.. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కేఎల్ హ‌ర్షిత‌, వివిధ శాఖ‌ల అధికారులు, స్థానిక పెద్ద‌ల‌తో క‌లిసి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ జ‌గ్జీవ‌న్ రామ్ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధునిగా, సంఘ సంస్క‌ర్త‌గా, సమర్థవంతమైన పరిపాలకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ముఖ్యంగా అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యావకాశాల విస్తరణ, సామాజిక న్యాయం సాధనలో ఆయన చేసిన కృషి అమూల్యమని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు కల్పించాలనే దృక్పథంతో ఆయన అమలు చేసిన విధానాలు నేటికీ మార్గదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత ఆయన ఆశ‌యాల బాట‌లో సామాజిక బాధ్యతతో ముంద‌డుగు వేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

శాస‌న‌స‌భ్యుడు యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు మాట్లాడుతూ కేంద్ర కార్మిక శాఖ‌తో పాటు వివిధ శాఖ‌ల మంత్రిగా బాబు జ‌గ్జీవ‌న్‌రామ్ గారు విశిష్ట సేవ‌లు అందించార‌ని.. క‌నీస వేత‌నాలు చ‌ట్టం, ప్రావిడెంట్ ఫండ్ చ‌ట్టం వంటి ఎన్నో చ‌ట్టాల నిర్మాణంతో పాటు క‌ష్ట‌జీవుల‌, శ్రామికుల సాంఘిక భ‌ద్ర‌త‌కు దారులు వేసిన మ‌హ‌నీయుడు జ‌గ్జీవ‌న్‌రామ్ అని పేర్కొన్నారు. బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు సమాజ నిర్మాణానికి బలమైన పునాది వేశాయ‌ని.. సమానత్వం, సహకారం, పరస్పర గౌరవం వంటి విలువలను ప్రతి ఒక్కరూ పాటించ‌డం ద్వారా సమగ్ర అభివృద్ధి, నిరంత‌ర ప్ర‌గ‌తికి స‌మ‌ష్టిగా కృషిచేద్దామ‌ని పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో సాంఘిక సంక్షేమ శాఖ ఏఎస్‌డ‌బ్ల్యూవో వీఎస్ఎస్ గ‌ణేష్ బాబు, సూప‌రింటెండెంట్ ఎన్‌.బాబురావు, వివిధ శాఖ‌ల అధికారులు, ఎస్‌సీ, ఎస్‌టీ సంఘాల నేత‌లు, విద్యావేత్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply