పోరాటం నుంచి ప్రజాసేవ వరకు సీతక్క ప్రస్థానం
పోరాటం నుంచి ప్రజాసేవ వరకు సీతక్క ప్రస్థానం
కరోనా సంక్షోభంలో ప్రజల అండగా నిలిచిన నాయకురాలు
గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వినూత్న కార్యక్రమాలు
ధనసరి అనసూయ అనే పేరు కంటే సీతక్క అనే పేరే తెలంగాణ ప్రజలకు ఎంతో ఆత్మీయంగా వినిపిస్తుంది. ప్రజా నాయకురాలు సీతక్క… మంత్రి సీతక్క…. ఆదివాసీ ఆడబిడ్డ సీతక్క అంటూ ప్రతి ఒక్కరూ ఆమెను ప్రేమగా, అభిమానంగా పిలుచుకుంటారు. ఆమె రాజకీయ నాయకురాలిగా మాత్రమే కాదు… కష్టాల్లో అండగా నిలిచే అక్కగా, ఆదుకునే అమ్మగా, ఆపదలో ముందుండే ధైర్యవంతురాలిగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు సీతక్క. అందుకే ములుగు ప్రజలు ఆమెను ఎమ్మెల్యేగా కాకుండా తమ సొంత కుటుంబ సభ్యురాలిగానే భావిస్తారు.
1971 జూలై 9న ములుగు మండలం జగన్నపేటలో జన్మించిన సీతక్క అసలు పేరు ధనసరి అనసూయ. చిన్ననాటి నుంచే అణగారిన వర్గాల జీవితాలను చూసి చలించిపోయిన సీతక్క, అణచివేతపై ఆగ్రహించారు. పదో తరగతి చదువుతున్న సమయంలో సామాజిక చైతన్య భావాలు ఆమెను ఆకర్షించడంతో, 1988లో ప్రజల కోసం పోరాడాలనే సంకల్పంతో వామపక్ష ఉద్యమ జీవితంలోకి అడుగుపెట్టారు. దాదాపు పదిహేనేళ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేశారు సీతక్క. అటుతర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై విశ్వాసంతో జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన సీతక్క ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేశారు.
జనజీవన స్రవంతిలో కలిసిన సీతక్క… 2001లో హైదరాబాద్లో న్యాయశాస్త్రం అభ్యసించి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె పోరాట పటిమను గుర్తించిన అప్పటి తెలుగుదేశం అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆమెకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించారు. తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయాల్లో ప్రవేశించి 2009లో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. అనంతరం రాష్ట్ర విభజన పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీలో చేరి 2018లో ములుగు నుంచి ఘన విజయం సాధించారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరోసారి విజయం సాధించి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఒక ఆదివాసీ మహిళ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించడం కేవలం సీతక్క మాత్రమే.
కరోనా లాక్డౌన్ సమయంలోనూ కొండలు, వాగులు దాటి గిరిజన, ఆదివాసీ గ్రామాలకు స్వయంగా వెళ్లి నిత్యావసర వస్తువులు, మందులు అందించి వేలాది కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ఒక విస్ఫోటనంలా వ్యాపించి సీతక్క సేవ, కష్టం ఏంటో యావత్ ప్రపంచానికి తెలిపాయి.
ప్రజా ప్రతినిధి అంటే ప్రజలతో కలిసి పనిచేయాలనే సందేశాన్ని తన చేతలతో చాటి చెప్పారు మంత్రి సీతక్క. గిరిజన ప్రాంతాల అభివృద్ధిని జీవిత లక్ష్యంగా తీసుకున్న సీతక్క వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ముందుకు కదులుతున్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఏజెన్సీ ప్రాంతంలో కంటెయినర్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవలను ప్రజలకు చేరువ చేశారు. అదే స్పూర్తితో ములుగు జిల్లా బంగారుపల్లి ఆవాస గ్రామంలో రాష్ట్రంలోనే తొలి కంటెయినర్ ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసి గిరిజన చిన్నారులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకున్నారు.
అటవీ ప్రాంతాల్లో సాధారణ భవనాలకు అనుమతులు లేని పరిస్థితుల్లో కూడా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి విద్యా హక్కును కాపాడుతున్నారామె. ప్రజల బాధను తన బాధగా భావిస్తూ, అభివృద్ధిని తన బాధ్యతగా స్వీకరిస్తూ, నిరంతరం ప్రజల మధ్యే జీవించే సీతక్కకు పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆమె ప్రజాసేవా ప్రస్థానం మరింత విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిద్దాం.
– సత్తు మల్లేష్
కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్
