రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర

రైతాంగ పోరాటంలో కొమరయ్య కీలక పాత్ర

  • మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరవీరుడు దొడ్డి కొమరయ్య పాత్ర కీలకమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన త్యాగం తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా శుక్రవారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి రాజనర్సింహ, కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోతిరెడ్డిపల్లిలోని కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయం, సమానత్వం కోసం కొమరయ్య చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని పిలుపునిచ్చారు. ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని సూచించారు. కొమరయ్య వంటి మహనీయుల ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన గొప్ప నేత
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన గొప్ప నాయకుడు దొడ్డి కొమరయ్య అని కొనియాడారు. యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ పొందుతూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి విలువలను ఆచరిస్తూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతా ప్రభాకర్, సంగారెడ్డి, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్లు కూన వనిత, సుమలత శ్రీకాంత్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జగదీశ్, కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డం మల్లయ్య, జనరల్ సెక్రటరీ తాటిపల్లి పాండు, బీసీ సంఘం యూత్ ప్రెసిడెంట్ రమేష్ కుమార్, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply