ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సర్పంచ్ భానుప్రియ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

రాష్ట్ర బడ్జెట్ ఆమోదం అనంతరం కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించామని తెలిపారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే బేస్మెంట్ లేదా పిల్లర్లు వేసుకున్న ఇళ్లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తామని చెప్పారు.

విద్యాభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ఒక తెలంగాణ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఉరుమడ్ల గ్రామంలో మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నందున ఇక్కడ మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.

గ్రామ అభివృద్ధి కోసం సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, అంగన్వాడీ భవనాల పూర్తి, చెరువు పటిష్టీకరణ వంటి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామానికి రూ.2 కోట్లతో బీటీ రహదారి మంజూరు అయిందని చెప్పారు. రాబోయే ఏడాదిలో మిగిలిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం క్లిష్ట పరిస్థితుల్లోనూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా అర్హులైన వారికి రేషన్ కార్డులు కూడా త్వరలో మంజూరు చేస్తామని చెప్పారు.

జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభల ద్వారా పథకాల లబ్ధిదారుల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళా శక్తి, ఉచిత బస్సు, రైతులకు బోనస్ వంటి పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని చెప్పారు.

అంతకుముందు గ్రామ సర్పంచ్ భానుప్రియ గ్రామసభను ప్రారంభించి ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్, తహసీల్దార్ విజయ, ఎంపీడీవో జయలక్ష్మి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

అనంతరం ఉరుమడ్ల గ్రామ శివారులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ప్రారంభించారు.

Leave a Reply