పటాల్స్ పీక్ పర్వతారోహకునికి ఘన సన్మానం…

పటాల్స్ పీక్ పర్వతారోహకునికి ఘన సన్మానం…

  • ఆర్థికంగా ప్రోత్సహించి అభినందించిన డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు

ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : ఎమ్మిగనూరు పట్టణంలోని మల్లెల గ్రూప్స్ అధినేత డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు నివాసంలో పటాల్సు పీక్ పర్వతారోహకుడు రాజ్ కుమార్ ను బుధవారం ఘనంగా సన్మానించారు. దాదాపు 4220 మీటర్స్, అంటే దాదాపుగా 13,845 అడుగుల శిఖరాన్ని రెండు రోజుల్లో అధిరోహించిన గోనెగండ్ల నివాసి పేదింటి బిడ్డ రాజ్ కుమారును సన్మానించి, అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా శిఖరాన్ని అధిరోహించిన రాజ్ కుమార్ మాట్లాడుతూ హిమాచల్ ప్రదేశ్ లోని పటాల్స్ పీక్ శిఖరాన్ని అధిరోహించాలని అనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం స్పాన్సర్స్ కోసం వెతికినప్పుడు ఎవరూ కూడా ముందుకు రాలేదు, అలాంటి సందర్భంలో పూలే అంబేడ్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు సింగనీటి నరసన్న, యువరాజు ల ద్వారా మల్లెల గ్రూప్స్ అధినేత డా. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజునూ సంప్రదించి నా యొక్క ఆశయాన్ని వివరించడం జరిగిందన్నారు. మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు వెంటనే స్పందించి శిఖరాన్ని అధిరోహించడానికి సంబంధించిన ఆర్థిక ప్రోత్సాహాన్ని, ఆత్మస్థైర్యాన్ని నాలో బలంగా నింపి నన్ను ప్రోత్సహించి పంపడం జరిగిందన్నారు.

అందుకే ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానన్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో నేను అధిరోహించబోయే ఎవరెస్టు శిఖరానికి సంబంధించిన ఆర్థిక ప్రోత్సాహానికి కూడా దాతలు ముందుకు రావాలని కోరారు. అనంతరం డా.మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ ఇలాంటి పేదింటి విద్యార్థులకు ఎల్లవేళలా అన్ని రకాలుగా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని, గతంలో కూడా అదే గోనెగండ్ల నివాసి అయిన సురేష్ అనే విద్యార్థి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినప్పుడు సురేష్ కూడా నా వంతు సహాయ సహకారాలు అందించాననీ, అలాగే ఈ రాజ్ కుమార్ కూడా భవిష్యత్తులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి గల ఆర్థిక ప్రోత్సాహాన్ని కూడా అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ నిర్వహకులు పాల్గొన్నారు.