ప్రజా సహకారంతో చేధించిన లక్ష్యం…

ప్రజా సహకారంతో చేధించిన లక్ష్యం…

100 శాతం పన్నుల వసూళ్లలో ఆంధ్రప్రభ కీలక పాత్ర..
15వ ఆర్థిక సంఘం నిధులు పొందడంలో అచ్చంపేట పురపాలక సంఘం ఘనత

అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పురపాలక సంఘం పన్నులు 2 కోట్ల 64 లక్షల రూపాయల వసూళ్ల లక్ష్యాన్ని సాధించి 15వ ఆర్థిక సంఘం నిధులను పొందడంలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ లక్ష్య సాధనలో అచ్చంపేట మున్సిపల్ మేనేజర్ వి. రమేష్ నాయక్, ఆయన సిబ్బంది తమ అహర్నిశ కృషి, సంఘటిత కార్యాచరణతో ఒక గొప్ప విజయం సాధించారు. అచ్చంపేట మున్సిపల్ సిబ్బంది సెలవుదినాలు, మండుటెండలను పరిగణనలోకి తీసుకోకుండా పన్నుల వసూళ్లలో టార్గెట్‌ను మించి ఆర్థిక లక్ష్యాన్ని సాధించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ, “ఈ విజయానికి ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఛైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, కమీషనర్ మురళి, ఆర్.ఐ, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సిబ్బందిలు, ప్రజా ప్రతినిధులు అందించిన సహకారంతో పాటు అచ్చంపేట పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, ట్రేడ్ లైసెన్స్ దారుల ఆధరాభిమానాలతో ఈ లక్ష్యాన్ని సాధించగలిగామని, ముఖ్యంగా ఆంధ్రప్రభ దినపత్రికలో ఈ పన్నుల చెల్లింపులు, ఆర్థిక సంఘం నిధుల ఆవశ్యకత, పట్టణ మౌళికాభివృద్ది ప్రాధాన్యతపై “100 శాతం వసూళ్లే లక్ష్యం `టార్గెట్‌కు ఒక్క అడుగు దూరం” శీర్షికగా ప్రచురించిన వార్తలు ప్రజలను ఈ కార్యక్రమానికి మరింతగా ప్రేరేపించాయి” అని ఆయన తెలిపారు.

ఈ విజయాన్ని సాధించిన ప్రజలు, వ్యాపారస్తులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక లక్ష్యాన్ని సాధించి, 15వ ఆర్థిక సంఘ నిధుల ప్రవాహాన్ని సుగమం చేసిన మేనేజర్ రమేష్, సిబ్బంది పై ప్రజల నుంచి, వ్యాపారస్తుల నుండి సోషల్ మీడియా వేదిక ద్వారా అభినందనలు అందుకుంటున్నారు. ఈ విజయంతో, అచ్చంపేట పురపాలక సంఘం పన్నుల వసూళ్ల రంగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

విమర్శలపాలైన ప్రభుత్వ కార్యాలయాలు…

ఈ విజయ సాధనలో పన్నులు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం విమర్శలకు గురయ్యాయి. ప్రభుత్వ కార్యాలయాలలో అత్యధికంగా 60 లక్షల పైగా పన్నులు బాకీగా ఉండగా, ఒక్క ఆర్టీసి సంస్థ మాత్రం 2 లక్షల రూపాయలు చెల్లించిందని తెలుస్తోంది. మిగతా ప్రభుత్వ కార్యాలయాలు తమ బాధ్యతను నిర్వర్తించకుండా, ఈ పన్నుల చెల్లింపులో సహకరించకపోవడంపై పలు విమర్శలు వెలువడుతున్నాయి.

Leave a Reply