భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు

భక్తులకు మిషన్ భగీరథ త్రాగు నీటి సేవలు
లోతట్టు ప్రాంతాల్లోనూ తాగునీటి ఏర్పాట్లు పూర్తి
అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా, నల్లమల అటవీ ప్రాంతంలో చైత్ర శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఏప్రిల్ 1 నుండి 3 వరకు జరిగే ప్రసిద్ధ సలేశ్వరం జాతరకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యాల కల్పనలో గ్రామీణ నీటిపారుదల శాఖ (మిషన్ భగీరథ) ముందంజ వేసింది. జాతర ప్రారంభం రేపటి నుండి నుంచే కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అచ్చంపేట మిషన్ భగీరథ డి.ఈ హేమలత ఆధ్వర్యంలో సిబ్బంది నల్లమల లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి తాగునీటి సౌకర్యాలను సమగ్రంగా ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రదేశాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాతో పాటు సింటెక్స్ ట్యాంకులను ఏర్పాటుచేసి కొత్తగా బోర్‌వెల్లులను త్రవ్వించి నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. విద్యుత్తు అంతరాయం ఏర్పడకుండా సోలార్ విద్యుత్తుతోపాటు జనరేటర్ సౌకర్యాన్ని సైతం కల్పించారు. సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సమస్యను ముందుగానే పరిష్కరించడం శాఖ పనితీరుకు నిదర్శనమని స్థానికులు అభినందిస్తున్నారు.
అటవీ ప్రాంతంలో ఇలాంటి సౌకర్యాల ఏర్పాటు చేయడం ద్వారా భక్తుల భద్రత, ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈలు అక్బర్ బాషా, మధు, సందీప్, సాయి కృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను విజయవంతంగా పూర్తి చేశారు.
