డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:

డిజిటల్ అరెస్ట్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి:
జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక
చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నేటి డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు కొత్త రూపాల్లో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి సూచించారు. ఇటీవల “డిజిటల్ అరెస్ట్” పేరిట జరుగుతున్న మోసాలు అధికమవుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించే భాగంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాలను వెల్లడించారు.
నేరస్తులు పోలీస్, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల అధికారులుగా నటిస్తూ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ లేదా మెసేజ్‌ల ద్వారా ప్రజలను సంప్రదించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎస్పీ వివరించారు. “మీపై కేసు నమోదైంది”, “మీ ఆధార్ లేదా బ్యాంక్ ఖాతా అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించబడింది” వంటి అబద్ధపు సమాచారంతో బాధితులను మోసగాళ్లు గందరగోళానికి గురిచేస్తారని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులను గంటల తరబడి ఆన్‌లైన్‌లో ఉంచి, బయటకు వెళ్లనీయకుండా మానసిక ఒత్తిడి పెంచి, వారి వ్యక్తిగత వివరాలను సేకరించి చివరకు డబ్బులు ఆన్‌లైన్ ద్వారా బదిలీ చేయించుకుంటున్నారని పేర్కొన్నారు.
పోలీసులు లేదా ఏ దర్యాప్తు సంస్థలు కూడా వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయవని, అలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే అవి మోసపూరితమని గుర్తించాలని స్పష్టం చేశారు. భయపెట్టే కాల్స్ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కుటుంబ సభ్యులు లేదా స్థానిక పోలీసులతో సంప్రదించాలని సూచించారు. అలాగే, బ్యాంక్ ఖాతా వివరాలు, OTPలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు.
అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా, అధికారులుగా పరిచయం చేసుకునే వారి వివరాలను సమీప పోలీస్ స్టేషన్‌లో ధృవీకరించుకోవాలని సూచించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేయవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి మోసాలకు గురైన వారు వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించేందుకు చిత్తూరు జిల్లా పోలీసులు నిరంతరం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అప్రమత్తతే రక్షణ అని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి ఇతరులకు కూడా ఈ విషయాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు.
