చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త..

చందాపురంలో అతిసార కేసులపై అప్రమత్త..

ఇంటింటి వైద్య పరిశీలన
పరిస్థితి అదుపులోనే డీఎంహెచ్‌ఓ డా. సుహాసిని

నందిగామ, ఆంధ్రప్రభ : నందిగామ మండలం చందాపురం గ్రామంలో నమోదైన అతిసార కేసులపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్త చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం. సుహాసిని గ్రామాన్ని సందర్శించి వైద్య శిబిరాన్ని పరిశీలించడంతో పాటు బాధితులను ఇంటింటికి వెళ్లి పరిశీలించారు. అతిసారానికి గురైన వారంతా ప్రస్తుతం స్థిరస్థితిలో ఉన్నారని, స్వల్ప విరోచనాలతో ముగ్గురు మాత్రమే వైద్య శిబిరానికి వచ్చి చికిత్స పొందినట్లు తెలిపారు.

నందిగామ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారూ కోలుకుంటున్నారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా, మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. ఒకటి లేదా రెండు విరోచనాలు, వాంతులు వచ్చిన వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, తక్షణమే చికిత్స పొందాలని సూచించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ ఆహారం తీసుకోకుండా వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, క్లోరినేషన్ చేసిన నీటినే తాగాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో వైద్య బృందాలు ఇంటింటికి తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, త్రాగునీటి వనరులన్నింటిని క్లోరినేషన్ చేయడం, నీటి నమూనాలను పరీక్షించడం జరుగుతోందని పేర్కొన్నారు. డీహైడ్రేషన్ నివారణకు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి దశల వారీగా తాగాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఇందుమతి, డాక్టర్లు నవీన్, సునీల్ తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply