అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్

అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్

వికారాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులు
అక్రమ డీజిల్, గ్యాస్ సిలిండర్లు, ఎర్రమట్టి సీజ్.

వికారాబాద్, ఆంధ్రప్రభ : జిల్లాలో అక్రమ వ్యాపారాలు, రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్‌కే అన్వర్ పాషా ఆద్వర్యం లో టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా కర్ణాటక నుండి హైదరాబాద్‌కు అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ట్యాంకర్‌ను అధికారులు పట్టుకున్నారు. మియాపూర్ నివాసి గోల్కొండ రాజుకు చెందిన ఈ ట్యాంకర్‌ను డ్రైవర్లు గొనెళ్ల కిరణ్, అనిగెల అనిల్ నడుపుతుండగా స్వాధీనం చేసుకుని, చెన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయడం జరిగింది.

అలాగే, మన్నెగూడ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎర్రమట్టిని రవాణా చేస్తున్న టిప్పర్‌ను టాస్క్ ఫోర్స్ బృందం పట్టుకుంది. విజేందర్ రెడ్డికి చెందిన ఈ వాహనాన్ని జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఉపేందర్ మెహతా నడుపుతుండగా గుర్తించి, వాహనాన్ని స్వాధీనం చేసుకుని చెంగోమల్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది.

మరొక ఘటనలో, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపల్లి రామకృష్ణ రెడ్డి తన నివాసంలో అక్రమంగా సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారన్న పక్కా సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో 4 నిండుగా ఉన్న డొమెస్టిక్ సిలిండర్లు, 14 ఖాళీ సిలిండర్లు, 6 కమర్షియల్ సిలిండర్లను (మొత్తం 24) గుర్తించి సీజ్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని వికారాబాద్ పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదు చేయడం జరిగింది. జిల్లాలో ఎలాంటి అక్రమ రవాణా లేదా నిల్వలు చేపట్టినా కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Leave a Reply