ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు

ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు
గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయం
పదవీ విరమణ వయసు పెంచాలన్న ఉప సంఘం నిర్ణయంపై ఎన్‌జీజీవో హర్షం
మంత్రుల బృందానికి సంఘం తరఫున ధన్యవాదాలు తెలిపిన
ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్
విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచాలని మంత్రుల బృందం (జీవోఎం) తీసుకున్న నిర్ణయానికి ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ. విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హెచ్ఆర్‌డీ మంత్రి నారా లోకేష్, మునిసిపల్ శాఖ మంత్రి పి. నారాయణలతో కూడిన మంత్రుల బృందం ఉద్యోగుల సమస్యలపై సానుకూల దృక్పథంతో స్పందించి ఆర్థిక భద్రత, కుటుంబ స్థిరత్వం, సేవా అనుభవం వినియోగం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిపి ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల విద్యా సంస్థల ఉద్యోగులకు వయో పరిమితిని పెంచాలని ప్రతిపాదనలు సమర్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.ఈ విషయం లో ఎ పి ఎన్ జి జి ఓ నాయకులు పలు దఫాలుగా మంత్రుల బృందంతో చర్చలు కృషికి ప్రతిఫలంగానే మంత్రుల బృందం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం త్వరలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందుకు వచ్చి ఆమోదం పొందడం ద్వారా ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీలకు చెందిన 8,500 మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత మరింత బలోపేతం కావడంతో పాటు, వారి అనుభవాన్ని ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం కలుగుతుంది .ఈ నిర్ణయం తీసుకున్న మంత్రుల బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఎ పి ఎన్ జి జి ఓ రాష్ట్ర సంఘ అధ్యక్షుడు ఎ. విద్యాసాగర్ తెలిపారు.
