బాలికను గర్భిణీగా తప్పుడు నిర్ధారణ చేయడంతో..

బాలికను గర్భిణీగా తప్పుడు నిర్ధారణ చేయడంతో..
నర్సంపేట, ఆంధ్రప్రభ : పట్టణంలోని వరంగల్ రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కానింగ్ సెంటర్‌లో తప్పుడు నిర్ధారణ కలకలం రేపింది. సాధారణ ఆరోగ్య సమస్యతో తీసుకెళ్లిన ఓ బాలికను గర్భిణీగా డిక్లేర్ చేయడం, కుటుంబ సభ్యులను ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురి చేసింది. అసత్య నివేదికను చూసి షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు, సెంటర్‌లో పని చేస్తున్న వైద్యుడిని నిలదీస్తూ దేహశుద్ధి చేశారని సమాచారం. సహచర వైద్యులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినా ఆగ్రహంతో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
స్థానికులు, రోగులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…“ఇలాంటి ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. తప్పుడు రిపోర్టులు జీవితాలను నాశనం చేస్తాయి. చర్యలు తీసుకోవాలి” అంటూ మండిపడుతున్నారు. ఈ ఘటనతో నర్సంపేటలో వైద్య నిర్లక్ష్యం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారుల దృష్టికి విషయం వెళ్లగా, సెంటర్ పై విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
