హైవే ఆక్రమణలపై కఠిన చర్యలు…

హైవే ఆక్రమణలపై కఠిన చర్యలు…
పీడీ పార్వతీశం హెచ్చరిక
యడ్లపాడులో హైవేపై ఆక్రమణలపై కఠిన చర్యలు
యడ్లపాడు, ఆంధ్రప్రభ : హైవేపై ఆక్రమణలు చేస్తే చర్యలు తీసుకుంటామని 16వ నంబర్ జాతీయ రహదారి పీడీ పార్వతీశం హెచ్చరించారు. సోమవారం యడ్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్వీస్ రోడ్డును ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా సర్వీస్ రోడ్డు మార్జిన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలు, మురుగుకాల్వలపై ఉన్న ఆక్రమణలను గమనించి హైవే నిర్వహణ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ వ్యవస్థను త్వరలో పునరుద్ధరించి పాదచారులకు నడకదారులుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల కారణంగా సర్వీసురోడ్డు పనులు పూర్తి చేసేందుకు వీలు లేకుండా పోయిందన్నారు. ఏళ్లు గడచినా న్యాయస్థానంలో హైవేకు సంబంధించిన కేసులు వలన పనులు ఆలస్య మయ్యాయని,అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ముప్పవరం నుంచి రాజధాని అమరావతి వరకు,అలాగే బెంగళూరు–చెన్నై మార్గాలతో అనుసంధానంగా సర్వీస్ రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రణాళిక ఉందన్నారు.

అవి పూర్తయిన తరువాత స్థానిక వాహనాలను సర్వీస్ రోడ్లకే పరిమితం చేసి,ప్రధాన హైవేను దీర్ఘదూర వాహనాలకు ఎక్స్‌ప్రెస్ మార్గంగా ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ వేసవిలో డ్రైనేజీలపై ఉన్న చిన్న వ్యాపారులు,ఇతర ఆక్రమణలను గుర్తించి తొలగించేందుకు రెవెన్యూ,పోలీస్ శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ముఖ్యంగా డ్రైనేజీపై ఉన్న ఆక్రమణల వల్ల వర్షాల సమయంలో మురుగు,వర్షపునీరు ముందుకు వెళ్లక రహదార్లు కూడా దెబ్బతినటంతో పాటు స్థానిక ప్రజలకు వాహనచోదకులక ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుతం ఆక్రమణ తొలగిపుంతో పాటు అదనంగా డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు,వీధి దీపాల మరమ్మత్తులు కూడా చేపడతామని వెల్లడించారు.

