రైతు అభ్యున్నతే లక్ష్యం – పెమ్మసాని చంద్రశేఖర్.

రైతు అభ్యున్నతే లక్ష్యం – పెమ్మసాని చంద్రశేఖర్.

తెనాలి, ఆంధ్రప్రభ : తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం స్థానిక యార్డు ప్రాంగణంలో అట్టహాసంగా నిర్వహించారు. యార్డు చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్‌గా టిడిపికి చెందిన పాలడుగు సురేంద్రతో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

భారీ ర్యాలీలతో సందడి..
చైర్మన్ తోట దుర్గాప్రసాద్ తన అనుచరులతో శివాజీ చౌక్ నుండి మేళతాళాలతో భారీ ర్యాలీగా యార్డు ప్రాంగణానికి చేరుకోగా, వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర కూడా పెదరావూరు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ చేరుకున్నారు. టిడిపి, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ద్విచక్ర వాహనాలు, కార్లతో నిర్వహించిన ర్యాలీలతో పట్టణంలోని ప్రధాన వీధులు కిక్కిరిసిపోయాయి.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. కూటమి కార్యకర్తలు తమ ఓటును ఉద్యమంలా వినియోగించుకోవడంతోనే విజయం సాధించామని అన్నారు. “మైండ్ సెట్ మారాలి” అంటూ విమర్శలు చేస్తున్న వారికి ముందుగా ఎవరి మైండ్ సెట్ మారాలో ఆలోచించుకోవాలని సూచించారు. అమరావతి అభివృద్ధి, ప్రజా వేదిక కూల్చివేత వంటి అంశాలను ప్రస్తావిస్తూ గత ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోందని, గతంలో మాత్రం శంకుస్థాపనలకే పరిమితమయ్యారని వ్యాఖ్యానించారు. రైతుల సమస్యల పై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ధరలు పడిపోయినప్పుడల్లా రైతులకు అండగా నిలుస్తామని తెలిపారు. వైసిపి ప్రభుత్వ బడ్జెట్ కంటే రెట్టింపు స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

గత ప్రభుత్వం పై విమర్శలు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని, పంట అమ్మకాల విషయంలో కూడా పరిమితులు విధించిందని ఆరోపించారు. ఒక బస్తా యూరియా కోసం రైతులు పడిన కష్టాలను గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధరలు, ఇన్‌పుట్ సబ్సిడీలు అందిస్తూ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 15 ఏళ్ల పాటు కలిసి పని చేయాలని ఇచ్చిన పిలుపు వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు.

యార్డు ప్రాముఖ్యతపై నేతల వ్యాఖ్యలు
ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ఈ మార్కెట్ యార్డు ఏర్పాటుకు కొత్త రఘురామయ్య నాయకత్వం కారణమని తెలిపారు. ఎన్టీఆర్ కాలంలో యార్డు నిధులతో గ్రామీణ రహదారులు అభివృద్ధి చెందినట్లు గుర్తు చేశారు. రైతును రాజుగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. యార్డు పాలకవర్గం రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలని సూచించారు. పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా కృషి చేయాలని కోరారు.

చైర్మన్, వైస్ చైర్మన్ స్పందన
చైర్మన్ తోట దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. తన పై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర మాట్లాడుతూ.. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు రైతుల కష్టాలు తెలుసని, రైతులకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా పని చేస్తానన్నారు.

పెద్ద ఎత్తున హాజరు
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీక్రిస్టినా, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, టిడిపి సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, పిల్లి మాణిక్యరావు, గాదె వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పరిసర గ్రామాల నుంచి రైతులు, మహిళలు, కార్యకర్తలు వేలాదిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply