అరసవల్లి క్షేత్రానికి మహర్దశ..

అరసవల్లి క్షేత్రానికి మహర్దశ..

రూ. 4 కోట్లతో పుష్కరిణి పునరుద్ధరణ పనులు
శంకుస్థాపన చేసిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు
ప్రసాద్‌ స్కీమ్ ద్వారా రూ. 58 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు
కూటమి ప్రభుత్వంతోనే ఆధ్యాత్మిక వైభవం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలివస్తున్న ప్రసిద్ధ అరసవల్లి క్షేత్రాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం ద్వారా 58 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు . అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలోని ఇంద్రపుష్కరిణి ఆధునికీకరణ పనులకు శనివారం సాయంత్రం ఘనంగా శంకుస్థాపన జరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు.

రూ. 58 కోట్లతో మెగా మాస్టర్ ప్లాన్..

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. అరసవల్లి క్షేత్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు కృషితో ఇప్పటికే పుష్కరిణి పనులకు 4 కోట్లు మంజూరయ్యాయని, కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకం కింద మరో . 58 కోట్లతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక వంటశాల, భోజనశాల, భక్తుల కోసం వసతి గృహాలు, విశాలమైన రహదారులను నిర్మిస్తామన్నారు. ఈ పనులను రెండు దశల్లో చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

అరసవల్లి రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నాటి నుంచి భక్తుల తాకిడి గణనీయంగా పెరిగిందని, దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నారని మంత్రులు తెలిపారు . భక్తుల రద్దీకి అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో విశాలమైన రహదారులు, సెంటర్ లైటింగ్ పనులను ఇప్పటికే పూర్తి చేశామన్నారు. ఆధ్యాత్మిక కేంద్రాలను పర్యాటక హబ్‌లుగా మార్చడమే లక్ష్యమని, గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వీడి కూటమి హయాంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పలువురు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply