ర్యాగింగ్‌కు నో చెప్పండి..

ర్యాగింగ్‌కు నో చెప్పండి..

  • భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు తావులేదని, ఇటువంటి అనుచిత చర్యలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ హెచ్చరించారు. భూపాలపల్లి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నిర్వహించిన యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ర్యాగింగ్ శిక్షార్హ నేరమని స్పష్టం చేస్తూ, భవిష్యత్తు వైద్యులుగా పరస్పర గౌరవం, సహకారం, స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు.

ర్యాగింగ్ కారణంగా విద్యార్థులు మానసిక, శారీరక ఒత్తిడికి లోనవుతారని పేర్కొంటూ, కాలేజీ ప్రాంగణంలో సురక్షితమైన విద్యా వాతావరణం కోసం అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ర్యాగింగ్ ఘటనలు గమనించిన వెంటనే కాలేజీ యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలని, అవసరమైతే హెల్ప్‌లైన్ 1800-180-5522 లేదా డయల్ 100ను వినియోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డా. కే. వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ కే. రాజేష్ (అడ్మినిస్ట్రేషన్), వైస్ ప్రిన్సిపాల్ డా. బి. శ్రీధర్ రావు (అకాడమిక్), అధ్యాపకులు, పోలీస్ అధికారులు , వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.