నిషేధిత గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లాలో మాదకద్రవ్యాలపై పోలీసుల కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు సీసీఎస్ టీం, భూపాలపల్లి పోలీసులు సంయుక్తంగా మంగళవారం నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ పట్టివేత జరిగింది. పక్కా సమాచారంతో జిల్లా బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద నుంచి సుమారు 1 కిలో 500 గ్రాముల నిషేధిత గంజాయి లభ్యమైంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ దాదాపు రూ.75,000గా అంచనా వేశారు. అలాగే మూడు మొబైల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారిలో మహమ్మద్ పర్వేజ్ (22), దిండి సాయి తిరుమల్ (19) ఉండగా, కుర్రి చరణ్ (16) మైనర్‌గా గుర్తించారు. ఇద్దరు నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు తరలించారు. మైనర్‌ను జువెనైల్ కోర్టు ముందు హాజరుపరిచారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలపై సమాచారం ఉన్న వారు టోల్ ఫ్రీ నంబర్ 8712658111కు తెలియజేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.
భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల కేసులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, యువత వీటికి దూరంగా ఉండాలని సూచించారు. ఎస్‌ఐ సాంబమూర్తి మాట్లాడుతూ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

Leave a Reply