పోచంపాడ్‌లో కత్తిపోట్ల కలకలం

మెండోరా, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రిషిక్ (20) అనే యువకుడు మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచంపాడ్ గ్రామానికి చెందిన నర్సింలు, అతని కుమారుడు శ్రీకాంత్‌తో అదే గ్రామానికి చెందిన రిషిక్‌కు పాత విభేదాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఇరు వర్గాల మధ్య మళ్లీ వివాదం చెలరేగింది. సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవడానికి రిషిక్, నర్సింలు ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడ వాగ్వాదం ఘర్షణకు దారితీసింది.
ఈ సమయంలో నర్సింలు కత్తితో దాడి చేయడంతో రిషిక్ కడుపులో తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్‌కు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి రిషిక్ మృతి చెందినట్లు ఎస్సై సుహాసిని జాదవ్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
