పదో తరగతి పరీక్షా కేంద్రం వద్ద స్వల్ప వాగ్వాదం

దమ్మపేట, ఆంధ్రప్రభ ; పదో తరగతి బోర్డు పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే దమ్మపేటలోని పరీక్షా కేంద్రం వద్ద శనివారం ఉదయం స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పరీక్ష జరుగుతుండగా ఉదయం ఈ ఘటన జరిగింది. పరీక్ష రాస్తున్న విద్యార్థులకు త్రాగునీటి సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయో లేదో పర్యవేక్షించేందుకు దమ్మపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంత్ పరీక్షా కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే.. ప్రధాన ద్వారం వద్ద బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి ఆయనను అడ్డుకున్నారు. తాను పంచాయతీ కార్యదర్శినని, లోపల నీటి వసతిని పరిశీలించేందుకు వెళ్తున్నానని అనంత్ తెలపగా,అందుకు గుర్తింపు కార్డు చూపించాలని కానిస్టేబుల్ కోరారు. నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రంలో ఏవైనా ఏర్పాట్లు ఉంటే ఉదయం 9.30 గంటలలోపే పూర్తి చేసుకోవాలని, సమయం దాటిన తర్వాత లోపలికి ఎవరినీ అనుమతించేది లేదని కానిస్టేబుల్ తేల్చిచెప్పారు.
దీంతో ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అక్కడే ఉన్న మండల విద్యాశాఖాధికారి జగపతి ఇరువురికి సర్దిచెప్పి, పరిస్థితిని సముదాయించారు. అనంతరం విద్యార్థులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఎంఈఓ చొరవ తీసుకుని పంచాయతీ కార్యదర్శిని లోపలికి పంపించడంతో వివాదం సద్దుమణిగింది.
