16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు…

16 నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు…
37,331 మంది విద్యార్థులు హాజరు…
160 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు.
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పదవ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు–మార్చి 2026 ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. కర్నూలు జిల్లాలో మొత్తం 37,331 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో రెగ్యులర్ విద్యార్థులు 33,796 మంది కాగా, వన్స్ ఫెయిల్డ్ ప్రైవేట్ అభ్యర్థులు 1,975 మంది, ఏపీఓ ఎస్ ఎస్ విద్యార్థులు 1,560 మంది ఉన్నారు. ఇందులో బాలురు 19,893 మంది, బాలికలు 17,438 మంది పరీక్షలకు నమోదు అయ్యారు.
552 పాఠశాలల నుంచి విద్యార్థులు…
జిల్లాలోని 552 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో 361 ప్రభుత్వ పాఠశాలలు, 191 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.
విభాగాల వారీగా చూస్తే…
ఆదోని డివిజన్ నుంచి 11,733 మంది,పత్తికొండ డివిజన్ నుంచి 6,609 మంది,కర్నూలు డివిజన్ నుంచి 15,454 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు.
పరీక్షల నిర్వహణకు 160 కేంద్రాలు…
జిల్లాలో పరీక్షల నిర్వహణకు 47 జోన్లు, 160 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల భద్రపరచడానికి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో స్టోరేజ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 160 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 160 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్లు 7, ఇక ప్రశ్నాపత్రాల పంపిణీకి రూట్ అధికారులు 12, సహాయ రూట్ అధికారులు 12 నియమించారు.
సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు…
జిల్లాలో కొన్ని కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. కర్నూలు, సీబెలగల్, దేవనకొండ, ఆస్పరి ప్రాంతాల్లోని కొన్ని పాఠశాలల వద్ద స్థానికుల ఇబ్బందులు లేదా మౌలిక వసతుల సమస్యలు ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశారు.
స్పాట్ వాల్యూయేషన్…
పరీక్షల అనంతరం ఏప్రిల్ 4 నుంచి 13 వరకు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించనున్నారు. కర్నూలు ఏ క్యాంప్‌లోని మాంటెసొరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద మూల్యాంకనం జరుగుతుంది.
విద్యార్థులకు సూచనలు…
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌లో పేర్కొన్న సబ్జెక్టులకే పరీక్షలు రాయాలి. తప్పుగా ఇతర ప్రశ్నాపత్రాల్లో పరీక్ష రాస్తే ఆ పరీక్షలు రద్దు అవుతాయని అధికారులు హెచ్చరించారు. అలాగే తమకు కేటాయించిన పరీక్షా కేంద్రంలోనే హాజరుకావాలి.
