కడెంలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: ఎంఈఓ షేక్ హుస్సేన్

కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) షేక్ హుస్సేన్ తెలిపారు. ఈ సంవత్సరం కడెం మండలంలో మొత్తం 413 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నట్లు చెప్పారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయని తెలిపారు.

కడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో మొత్తం 270 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్ష కేంద్రానికి చీఫ్ సూపరింటెండెంట్‌గా బాలాజీ, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్‌గా ప్రేమ్ దాస్, ఏడీఓగా టీ. క్రాంతికుమార్ వ్యవహరిస్తారని తెలిపారు.

ఈ పరీక్ష కేంద్రంలో నచ్చన్ ఎల్లాపూర్ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 76 మంది, కడెం జడ్పీ హైస్కూల్‌కు చెందిన 89 మంది, కడెం కేజీబీవీ పాఠశాలకు చెందిన 46 మంది, పాత మద్దిపడగ జడ్పీ హైస్కూల్‌కు చెందిన 14 మంది, అల్లంపల్లి జీయర్ గురుకులం పాఠశాలకు చెందిన 30 మంది, ఖానాపూర్ మండలం బీర్నంది జడ్పీ హైస్కూల్‌కు చెందిన 15 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 11 తరగతి గదులు కేటాయించి, 15 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. అలాగే కడెం మండలంలోని లింగాపూర్ జడ్పీ హైస్కూల్‌కు చెందిన 117 మంది విద్యార్థులు ఖానాపూర్ పరీక్ష కేంద్రంలో, అంబారిపేట్ జడ్పీ హైస్కూల్‌కు చెందిన 26 మంది విద్యార్థులు దస్తూరాబాద్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాయనున్నట్లు వివరించారు.

కడెం పరీక్ష కేంద్రంలో తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం, ఫ్యాన్లు, డెస్క్-బెంచీలు, మరుగుదొడ్లు వంటి అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించినట్లు ఎంఈఓ షేక్ హుస్సేన్ తెలిపారు.

Leave a Reply