చిరుత పిల్లను ఢీకొన్న వాహనం

చిరుత పిల్లను ఢీకొన్న వాహనం
- మృతి చెందిన చిరుత
- కర్నూలు జిల్లా కొండల్లో చిరుతల సంచారం… ప్రజల్లో భయం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా కొండ ప్రాంతాల్లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. దట్టమైన అడవుల్లో ఉండే ఈ మృగాలు కొండల పరిసర గ్రామాల వరకు చేరడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పశువులపై దాడులు, రహదారి ప్రమాదాలు చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
ఇటీవల ఆస్పరి మండలం అట్టేకల్లు గ్రామ సమీపంలోని కొండ ప్రాంతంలో ఆరు నెలల వయస్సు ఉన్న చిరుత పిల్ల మృతి చెందడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కర్నూలు -బళ్ళారిపక్కన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై పడిఉన్న మృతదేహాన్ని గమనించిన వాహనదారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న Adoni అటవీ పరిధి అధికారి తేజస్వని ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుత పిల్ల మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం శవ పరీక్ష నిర్వహించి అటవీ కార్యాలయానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే కొండ ప్రాంతాల్లో చిరుతల సంచారం గత ఏడాది నుంచి కొనసాగుతున్నప్పటికీ అటవీ శాఖ తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరుత పిల్ల మృతి చెందడంతో దాని తల్లి పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆస్పరిమండలంలోని కలపరి, తురువగళ్ళు, బైలు పత్తికొండ, ఐనేకల్లు, అట్టేకల్లు తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఇక మరోవైపు కుప్పగల్లు రైల్వే నిలయం సమీపంలోని కొండల్లో కూడా చిరుతలు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు. కొద్ది నెలల క్రితం కోసిగి–కుప్పగళ్ళు మధ్య రైలుకు ఢీకొని మూడు సంవత్సరాల వయస్సు ఉన్న చిరుత మృతి చెందింది. అదే ప్రాంతంలో మరో చిరుత అనుమానాస్పదంగా చనిపోవడం కూడా చర్చనీయాంశమైంది.
ఆలూరు నియోజకవర్గ పరిధిలో సుమారు 12 వేల హెక్టార్లలో విస్తరించిన పెద్ద కొండలు ఉన్నాయి. ఈ కొండల పరిసరంగా 47 గ్రామాలు ఉండగా, ఇప్పటికే సుమారు 18 గ్రామాల ప్రజలు చిరుతల సంచారం గురించి అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. పశువులపై దాడులు పెరగడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి, మేకలు, గొర్రెలను మేపడానికి కూడా భయపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
చిరుతల సంచారం పెరగడం, వరుస ప్రమాదాల్లో అవి మృతి చెందడం వంటి ఘటనలు అటవీ ప్రాంతాల్లో పరిస్థితిని క్లిష్టంగా మార్చాయి. కొండ ప్రాంతాల్లోకి చిరుతలు ఎలా చేరుతున్నాయో, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునేందుకు అటవీ శాఖ అధికారులు పరిశీలనలు ప్రారంభించారు. స్థానిక ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
